నోకియా ఆస్తుల డీఫ్రీజ్
న్యూఢిల్లీ: దేశంలోని నోకియా ఆస్తులను ఢిల్లీ హైకోర్టు డీఫ్రీజ్ చేసింది. దీనితో ఈ ఆస్తులను మైక్రోసాఫ్ట్‌కు అమ్మకానికి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. హ్యాండ్‌సెట్ మేకర్ నోకియాకు ఇదో పెద్ద ఊరటని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే నోకియా ఇండియా, దాని పేరెంట్ సంస్థ నోకియా కార్పొరేషన్ ఫిన్‌ల్యాండ్‌పై కొన్ని షరతులను విధించింది. సెక్షన్ 201/201 (1ఏ) కింద ట్యాక్స్ డిమాండ్‌ను నెరవేర్చడానికి, వడ్డీ, జరిమానాతో సహా కట్టడానికి కట్టుబడి ఉండాలని సంజీవ్ ఖన్నా, సంజీవ్ సచిదేవలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎస్క్రో అకౌంట్‌లో కనీసం రూ.2,250 కోట్లు నోకియా డిపాజిట్ చేయాలని సైతం ఆదేశించింది. దీనితోపాటు మైక్రోసాఫ్ట్ ఇంటర్నేషనల్‌తో ఒప్పందం వివరాలు అన్నింటినీ నెలలోపు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలని సూచించింది. నోకియా-మైక్రోసాఫ్ట్ ఇంటర్నేషనల్ డీల్ విలువ నివేదిక ఆధారంగా ఈ డిపాజిట్ పెంపుసహా ఇందుకు సంబంధించి తగిన మార్పులు చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. చెన్నై నోకియా యూనిట్ మైక్రోసాఫ్ట్ చేతికి వెళితే ముందస్తు పన్నుగా రూ.6,500 కోట్లు కట్టమని ఆదాయ పన్ను శాఖ డిమాండ్ నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు నుంచీ ఈ మేరకు తాజా ఆదేశాలు వెలువడ్డాయి.