ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్
హైదరాబాద్: ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ నెట్‌వర్క్(హైదరాబాద్ స్పిన్) ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్న ఆలిండియా స్పిన్ కాన్ఫరెన్స్-2015 మొదటి సదస్సును ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రస్తుత తరుణంలో విద్యార్థుల్లో నైపుణ్యం, పనితీరు, నాణ్యత మరింతగా మెరుగుపర్చుకోవాలన్నారు. ఐటీ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్), టీ హబ్ ఏర్పాటు చేసిందని చెప్పారు. టాస్క్ ద్వారా 200 కళాశాలలకు చెందిన 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టీ హబ్, టాస్క్‌లతో కలసి పనిచేయడానికి హైదరాబాద్ స్పిన్ ముందుకు రావాలని కోరారు.
నెలాఖరులోగా ఐటీ పాలసీ!
టీ హబ్, టాస్క్ ద్వారా వినూత్న ఐటీ రంగ అభివృద్ధికి తెరతీసిన తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంలో మరో ముందుడుగు వేయడానికి వినూత్న ఐటీ పాలసీని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోందని జయేష్‌రంజన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్ అడ్డు రాకుంటే ఈనెలాఖరులోగా ఐటీ పాలసీని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ ద్వారా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం: మోహన్‌రెడ్డి
ఐటీ రంగం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పురోగతి సాధిస్తోందని, 2025 నాటికి ఐటీ రంగ వ్యాపారం 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. 1990లో 100 మిలియన్ డాలర్లు ఉన్నది ప్రస్తుతం 140 బిలియన్ డాలర్లకు చేరిందని గుర్తు చేశారు. ఐటీ రంగంలో 3.5 మిలియన్ మంది ఐటీ రంగంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, గత ఏడాది 2.50 లక్షల మంది, ఈ ఏడాది 2.30 లక్షల మంది ఎంపికయ్యారని చెప్పారు. అనంతరం చెన్నై వరద బాధితుల కోసం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఓఓ, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మృత్యుంజయ్‌సింగ్, వర్చూసా ఇండియా ఆపరేషన్స్ హెడ్ సమీర్ ధీర్, హైదరాబాద్ స్పిన్ అధ్యక్షులు బీఎస్ గాంధీ, సలహాదారు ప్రకాశ్‌రావు, ఉపాధ్యక్షుడు రామ్మోహన్, స్పిన్ ప్రతినిధులు సతీష్, ప్రదీప్, మైసూర్, కేరళ, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సంస్థలు, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.