ఇద్దరు ఇండో అమెరికన్లకు ‘జూనియర్ నోబెల్ ప్రైజ్’
వాషింగ్టన్: శాస్త్రీయ పరిశోధనలకు ఇచ్చే భారీ నజరానాగా ఇచ్చే సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ద పబ్లిక్(ఎస్‌ఎస్‌పీ) పురస్కారం ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్‌లకు దక్కింది. మెదడుకు అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాధులను నయం చేసే పరిశోధనకుగాను ఇంద్రాణి దాస్ మొదటిస్థానంలో నిలిచి.. రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకోగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పరిశోధనకుగాను అర్జున్ రమణీ మూడోస్థానంలో నిలిచి లక్షన్నర డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. జూనియర్ నోబెల్ ప్రైజ్‌గా పిలిచే ఈ అవార్డు ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్లకు దక్కడంపై అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.
సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకుగాను 1942లో వెస్టింగ్‌హౌస్ ఈ పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత 1998 నుంచి ఈ పురస్కారం కింద ఇచ్చే నగదును ఇంటెల్ సంస్థ అందజేస్తోంది. ఇక ఈ బహుమతి గెలుచుకున్న 40 మంది ఫైనలిస్టుల్లో ఎనిమిది మంది భారతీయ మూలాలున్న యువతీయువకులే కావడం విశేషం. బహుమతి ప్రదానోత్సవంలో ఎస్‌ఎస్‌పీ ప్రెసిడెంట్ మాయా అజ్మీరా మాట్లాడుతూ... పురస్కారాన్ని అందుకున్న ప్రతిఒక్కరూ భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆక్షాంక్షిస్తున్నట్లు చెప్పారు.