ఫేస్బుక్ స్టేటస్ చూసి.. ఎన్నారై అరెస్టు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఓ కోర్టు అక్కడున్న భారతీయుడికి ఏడాది జైలుశిక్ష విధించింది. ఫేస్బుక్లో మతవిద్వేష పూరితంగా తన స్టేటస్ పెట్టుకున్నందుకే ఈ శిక్ష పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. తన ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్ చేసే సమయంలో ఇస్లాం మతాన్ని, మహ్మద్ ప్రవక్తను అతడు (41) తిట్టాడని దుబాయ్ కోర్టు నిర్ధారించింది. గత సంవత్సరం జూలై నెలలో ఇరాక్ యుద్ధం గురించి ఒక న్యూస్ బులెటిన్ చూసిన తర్వాత అతడు తన స్టేటస్ను అప్డేట్ చేశాడు.
జైలుశిక్ష పూర్తయిన తర్వాత అతడిని దుబాయ్ నుంచి స్వదేశానికి తిప్పి పంపేయాలని జడ్జి ఇజ్జత్ అబ్దుల్ లాత్ తన తీర్పులో చెప్పారు. నిందితుడి ఫేస్బుక్ స్టేటస్ తనకు వాట్సప్లో వచ్చిందంటూ దుబాయ్లో ఉండే మరో భారతీయుడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి జైలుశిక్ష పడింది. అయితే, 15 రోజుల్లోగా ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.