మెదడును తొలిచేస్తుంటే... గిటార్‌తో సరిగమలు
బెంగళూరులో అరుదైన సర్జరీ కోలుకున్న గిటారిస్టు
సాక్షి, బెంగళూరు : సంగీతంతో రోగాలను నయం చేయొచ్చన్న సంగతి పాతదే. చేతివేళ్లు మొద్దుబారిపోవడంతో ఓ వైపు మెదడుకు క్లిష్టమైన శస్త్రచికిత్స జరుగుతుండగా గిటార్ వాయిస్తూ తిరిగి కోలుకున్నాడు ఓ గిటారిస్టు. ఈ అరుదైన ఘటనకు బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ ఆసుపత్రి వేదికైంది. ఇలాంటి శస్త్రచికిత్స భారతదేశంలో ఇదే మొదటిసారి. స్టిరియోస్టాటిక్ అండ్ ఫంక్షనల్ న్యూరోసర్జన్ శరన్ శ్రీనివాసన్ సహచర వైద్యుడు సంజీవ్‌తో కలిసి శస్త్రచికిత్స నిర్వహించిన తీరును గురువారం మీడియాకు వివరించారు.
బిహార్‌కు చెందిన 37 ఏళ్ల అభిషేక్ ప్రసాద్ చాలా కాలంగా బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2012 నుంచి గిటారిస్ట్ కావాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి గిటార్ నేర్చుకుని చిన్నచిన్న ప్రదర్శనలు కూడా ఇచ్చారు. గత ఇరవై నెలలుగా ఆయన ఎడమ చేతి చూపుడు, ఉంగరపు, చిటికెన వేళ్లు క్రమంగా మొద్దుబారిపోయాయి. గిటారిస్టుల కు ఈ చేతివేళ్లే ఆధారం. మొదట్లో వైద్యులను సంప్రదించి మందులు తీసుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమైంది. వైద్య పరిభాషలో దీన్ని ఫోకల్ (గిటార్) డిస్టోనియా అంటారు.
అటు ఆపరేషన్, ఇటు గిటార్ ప్లే
ప్రసాద్‌కు ఎం.ఆర్.ఐ, సీటీ స్కాన్ తదితర పరీక్షల అనంతరం సమస్య పరిష్కారం కోసం బ్రెయిన్ సర్క్యూట్ సర్జరీ (స్టిరియోస్టాటిక్, ఎంఆర్‌ఐ గైడ్‌రైట్ థలమోటోపీ)ని చేయాలని వైద్యులు నిర్ణయించారు. మొదట రోగికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తరువాత ఈ నెల 11న శస్త్రచికిత్స చేశారు. తల, మెదడులో సర్జరీ చేయాల్సిన చోట మాత్రమే లోకల్ అనస్థిషీయా ఇచ్చారు. పుర్రెకు 14 మిల్లీమీటర్ల రంధ్రం చేశారు. 4 మిల్లీమీటర్ల వ్యాసం, ఏడు సెంటీమీటర్ల పొడవున్న సూదిని పుర్రె, మెదడు లోపలికి 8 నుంచి తొమ్మిది సెంటీమీటర్లమేర చొప్పించారు.
ఈ సమయంలో రోగి వేళ్లను కదిలించడానికి ప్రయత్నించమని చెబుతూ రేడియో ఫ్రీక్వెన్సీ అబాలిషన్ మిషన్ ద్వారా 60–70 సెల్సియస్ డిగ్రీల వేడిని 30–40 సెకన్ల పాటు మెదడులోని నిర్ధారిత ప్రాంతంలోకి ప్రసరింపచేశారు. వేడి తగిలినప్పుడు ఏ వేలు పనిచేయడం ప్రారంభించిందో రోగి, వైద్యునికి చెప్పాలి. అందువల్ల శస్త్రచికిత్స జరుగుతు న్నంత సేపూ అభిషేక్ ప్రసాద్ మెలకువలోనే ఉండి గిటార్‌ను వాయిస్తూ తన అనుభూతు లను డాక్టర్లకు చెబుతూనే ఉన్నారు. దాదాపు గంటన్నర శస్త్రచికిత్స తరువాత అతని మూడువేళ్లు మామూలుగా పనిచేయడం ఆరంభించాయి. ఈ చికిత్సకు పరికరాలను ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించామని వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఈ వ్యాధిని జయించానని అభిషేక్ ప్రసాద్ అన్నారు.