బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. గిటార్ వాయించాడు
షెన్జన్: ఆపరేషన్ థియేటర్లో వైద్యులు సీరియస్గా ఓ వ్యక్తి బ్రెయిన్కు సర్జరీ చేస్తున్నారు. అయితే సర్జరీ చేయించుకుంటున్న వ్యక్తి మాత్రం తాపీగా గిటారు వాయిస్తూ పడుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన దక్షిణ చైనాలోని షెన్జెన్లో చోటుచేసుకుంది.
వివారాల్లోకి వెళ్తే.. లీ జియాంగ్(57) అనే వ్యక్తి మెదడు సమస్యతో బాధపడుతున్నాడు. దీనివల్ల అతని చేతివేళ్లపై మెదడు నియంత్రణను కోల్పోయాడు. అతని మెదడులో బ్యాటరీతో కూడిన ఎలక్ట్రోడులను అమర్చడం ద్వారా అతన్ని తిరిగి మామూలుగా మార్చొచ్చని భావించిన వైద్యులు సోమవారం అపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో జియాంగ్ గిటార్ వాయించడానికి ప్రయత్నిస్తుండగా వైద్యులు ఎలక్ట్రోడుల పనితీరును నిర్థారించుకుంటూ అపరేషన్ పూర్తిచేశారు. కొత్తగా అమర్చిన ఎలక్ట్రోడ్లతో పదేళ్లపాటు జియాంగ్ తన వేళ్లపై నియంత్రణ కలిగి ఉంటాడని వైద్యులు వెల్లడించారు. గతంలో స్పెయిన్లో ఓ వ్యక్తి సాక్సాఫోన్ వాయిస్తుండగా వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే.