కేజ్రీవాల్ కిడ్నాప్‌కు కుట్ర | Indian Mujahideen Conspiracy to kidnap Kejriwal | Sakshi

కేజ్రీవాల్ కిడ్నాప్‌కు కుట్ర

Published Mon, Jan 20 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్

భత్కల్‌ను విడిపించుకోవడానికి ఐఎం భారీ ప్లాన్
పసిగట్టిన ఇంటెలిజెన్‌‌స.. ‘జెడ్ భద్రత’ తీసుకోవాలంటూ కేజ్రీవాల్‌కు సూచన
శంషాబాద్, కెంపేగౌడ విమానాశ్రయాల్లో తనిఖీలు

 
 సాక్షి, న్యూఢిల్లీ, బెంగళూరు/శంషాబాద్: పోలీసుల చెరలో ఉన్న ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ను విడిపించుకోవడానికి ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ భారీ పన్నాగమే పన్నింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అపహరించడం ద్వారా లేదా విమానాలను హైజాక్ చేయడం ద్వారా భత్కల్‌ను విడిపించుకుపోవాలని ఐఎం ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ ముప్పు గురించి ఢిల్లీ పోలీసులు ఆదివారం కేజ్రీవాల్‌కు వివరించారు. జెడ్ కేటగిరీ భద్రతను తీసుకోవాల్సిందిగా ఆయన్ను వారు కోరారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఉగ్రవాదుల ముప్పుపై నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారులు ధ్రువీకరించారు.
 
 మండిపడిన కేజ్రివాల్
 ‘‘నాకు ప్రాణభయం లేదు. నాకు దేవుడిపై నమ్మకముంది. పోలీసు భద్రత తీసుకునేదే లేదు’’ అని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పలు ట్వీట్‌లు చేశారు. భద్రతకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. తన భద్రతతో రాజకీయాలు చేయొద్దని ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘‘పోలీసులు ఈ రోజు(ఆదివారం) సాయంత్రం నన్ను కలిశారు. ముప్పుందని చెప్పారు. ఈ విషయం మీడియాతో చెప్పొద్దని కూడా అన్నారు. కానీ వారంతట వారే మీడియాకు చెప్పారు. ఈ విషయాన్ని ప్రకటించి.. వారు నాకు ముప్పు తెస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే నా మీద దాడి చేసి.. అది భత్కల్ మనుషులే చేశారనుకునేలా చేయొచ్చు’’ అంటూ మండిపడ్డారు. రాజకీయాలు చేయొద్దంటూ ఆయన పోలీసుల్ని కూడా కోరారు. ఢిల్లీలో అత్యాచారాలు, డ్రగ్స్ రాకెట్ విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిని ట్వీట్లలో ఘాటుగా ఎండగట్టారు.  
 
 హైజాక్ ప్లాన్..
 గతంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం హైజాక్ చేసి జైషే-మహ్మద్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్‌ను విడిపించిన తరహాలోనే యాసిన్ భత్కల్‌ను కూడా విడిపించుకు పోవాలని కూడా ఐఎం ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు పోలీసులకు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు కొద్ది రోజుల్లో గణతంత్ర వేడుకలున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీచేశారు. దీంతో మన రాష్ట్రంలోని శంషాబాద్, బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీ చేపట్టారు.
 
 రహస్య ప్రాంతంలో భత్కల్ విచారణ ..
 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి యాసిన్ భత్కల్‌ను బెంగళూరు తీసుకు వచ్చి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు తీసుకు వచ్చిన భత్కల్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ నెల 28 వరకు విచారణ చేయడానికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. భత్కల్‌ను బెంగళూరు నుంచి తీసుకు వెళ్లేలోపు విడిపించుకు పోవాలని ముజాహిద్దీన్ ఉగ్రవాదులు పథకం వేసినట్లు ఇంటెలిజెన్‌‌స వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement