లండన్: అత్యాచార కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తికి 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. బ్రిటన్ జాతీయత కల్గిన భారత సంతతికి చెందిన విక్రమ్ సింగ్(46) ఇద్దరు స్కూల్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు. కాగా ఈ కేసులో విక్రమ్ సింగ్ తో పాటు మరో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును వెలువరించిన లండన్ లోని ఓల్డ్ బెయిలీ కోర్టు.. విక్రమ్ సింగ్ కు 17 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. 2006 నుంచి 2012 వరకూ ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన విక్రమ్ సింగ్.. వారిని వ్యభిచార కూపంలోకి దింపాడు. దీనికి సంబంధించి విక్రమ్ సింగ్ ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అయితే అతనిపై మోపబడిన అభియోగాలు రుజువుకావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషులుగా తేలిన అసిఫ్ హుస్సేన్(33), అర్షాద్ జానీ(33)లకు 13 సంవత్సరాలు జైలు శిక్ష పడగా, మహ్మద్ ఇమ్రాన్ కు 19 ఏళ్ల శిక్ష, అక్బారీ ఖాన్(36) కు 16 సంవత్సరాలు, తమూర్ ఖాన్(19) మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది.