
కోర్టులో పడిపోయిన ఇంద్రాణి!
కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి ఇంద్రాణి ముఖర్జియాను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
ముంబై: కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి ఇంద్రాణి ముఖర్జియాను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇంద్రాణిని విచారిస్తున్న సమయంలో ఆమె కోర్టులో కళ్లు తిరిగిపడిపోయింది. కాగా, కాసేపటికి ఇంద్రాణి తేరుకుంది. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది.
ఇంద్రాణి ముఖర్జియాను విచారించడానికి మరికొంత సమయం కావాలని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించారు. వారి అభ్యర్థనను మన్నించిన కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది. ఇదిలా ఉండగా ఇంద్రాణిపై విషప్రయోగం జరిగే అవకాశం ఉన్నందున ఆమె ఇంటి నుంచి ఆహారాన్ని అనుమతించకూడదని ప్రాసిక్యూషన్ వాదించింది.