
భద్రతా మండలిలో సంస్కరణలకు ముందడుగు
ముసాయిదా ఆధారిత చర్చలకు
యూఎన్‌జీఏ ఏకగ్రీవ ఆమోదం
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో సంస్కరణల దిశగా కీలక ముందడుగు పడింది. నేటి నుంచి మొదలుకానున్న ఐరాస సర్వప్రతినిధి సభ(యూఎన్‌జీఏ) 70వ భేటీలో ఈ అంశంపై చర్చకు ఉద్దేశించిన చర్చా ప్రతిని ఐరాస జనరల్ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐరాసలో సంస్కరణలు, మండలి విస్తరణ, అందులో శాశ్వత సభ్యత్వం కోరుతున్న భారత్ వాదనకు నిర్ణయం ఊతమివ్వనుంది. దీన్ని చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించిన భారత్, ఈ నిర్ణయంతో మండలి సంస్కరణల ప్రక్రియ వేగం పుంజుకుంటుందని పేర్కొంది.
మండలిని విస్తరించి, సమ ప్రాతినిధ్యం కల్పించాలన్న అంశానికి సంబంధించిన చర్చపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం యూఎన్‌జీఏ అధ్యక్షుడు క్యుటెసా ప్లీనరీ భేటీ నిర్వహించారు. రష్యా, అమెరికా, చైనా సహా పలు కీలక దేశాల అభిప్రాయాలతో కూడిన లేఖలను సభ్యులకు అందించారు. రష్యా, అమెరికా, చైనాలు మండలిలో సంస్కరణపై చర్చా ప్రతి రూపకల్పనలో పాలుపంచుకోవడానికి నిరాకరిస్తూ పంపిన లేఖలూ అందులో ఉన్నాయి.
తర్వాత ఎలాంటి ఓటింగ్ లేకుండా, ఏకగ్రీవంగా ముసాయిదా ఆధారిత చర్చలకు ప్లీనరీ ఆమోదం తెలిపింది. మండలి సంస్కరణలపై ఏడేళ్లుగా ముసాయిదా లేకుండా ప్రభుత్వాల మధ్య(ఐజీఎన్) చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు చర్చలకు ప్రాతిపదికగా నిర్ధారిత ముసాయిదాను ఆమోదించడంతో సంస్కరణల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. తాజా నిర్ణయంతో ఐజీఎన్ చర్చలు ‘మళ్లీ పూర్వస్థితికి రావడానికి వీల్లేని’ మార్గంలో సాగనున్నాయి. ‘భారత్ అంగీకరించిన ముసాయిదాపైనే యూఎన్‌జీఏలో చర్చలు జరగనుండటం నేటి సర్వప్రతినిధి సభ భేటీలో ముఖ్యమైన అంశం’ అని ఐరాసలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ అన్నారు.