
చిలక జోస్యం... షేర్ల గమ్యం
సాక్షి, బిజినెస్ డెస్క్: ఆర్థిక మంత్రి చెప్పినా.. ఆర్‌బీఐ చెప్పినా స్టాక్ మార్కెట్లు మాత్రం ‘సినిమా సీతయ్య’లాగా ఎవ్వరి మాటా వినడం లేదు. ఇటు ఫండమెంటల్స్‌ను గానీ అటు టెక్నికల్స్‌ను గానీ పట్టించుకోవడం లేదు. అనలిస్టుల మాట అసలే ఎక్కించుకోవటం లేదు. చిన్నా, చితకా షేర్ల సంగతి పక్కన పెడితే బ్లూచిప్ షేర్లు సైతం తుక్కు తుక్కయిపోతున్నాయి. మార్కెట్ పల్స్‌ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో అదృష్టం ఎలా ఉంటుందో ఆ చుక్కలతోనే తేల్చుకుంటే పోలా.. అనుకుంటూ ఇన్వెస్టర్లు జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నారు. తారా బలాలు, జాతక చక్రాలపై ఆధారపడుతున్నారు. దీంతో ఆర్థిక జ్యోతిష్యుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
రియల్టీ, పసిడి పైనే మోజు...
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశీయంగా నయా మధ్యతరగతి వర్గాల ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నా.. షేర్లలో వారి ఇన్వెస్ట్‌మెంట్ అయిదు శాతం కన్నా తక్కువ గానే ఉంటోంది. స్టాక్‌మార్కెట్ల బదులు రియల్ ఎస్టేట్, బంగారంవైపే మనవాళ్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అడపాదడపా మార్కెట్లు, స్టాక్స్ ఎగుస్తూనే ఉన్నా 2008 నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దరిమిలా ఇన్వెస్టర్లు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో అనలిస్టుల కన్నా ఆస్ట్రాలజర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాల కోసం సంప్రతించినట్లే మార్కెట్స్ గురించీ తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక జ్యోతిష్యులతో పాటు ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సాఫ్ట్‌వేర్లు, సర్వీసులకూ డిమాండ్ పెరుగుతోంది. హేతుబద్ధత లేనిదని, టైమ్‌పాస్ వ్యవహారమని ఎందరు కొట్టిపారేసినా... ఫైనాన్షియల్ ఆస్ట్రాలజర్ల వ్యాపారం 2008 సంక్షోభం అనంతరం నుంచి ఏటా ముఫ్ఫై శాతం దాకా పెరుగుతోందన్నది నివేదికల సాక్షిగా నిజం.
జాతక చక్రమూ కీలకమే?
సాధారణంగా స్టాక్స్ లేదా సూచీల ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఎవరికైనా ఒకే రకమైన ఫలితాలు ఇస్తుంటాయి. ఆస్ట్రాలజీలోనూ కొండొకచో ఇలాంటివి ఉన్నా.. వ్యక్తిగతంగా ఇన్వెస్టర్ల జాతక చక్రాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుందన్నది ఆస్ట్రాలజర్ల మాట. ఎందుకంటే ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి.. ఒకరికి పనిచేసిన టిప్ మరొకరికి పనిచేయకపోవచ్చునని వారంటున్నారు. ఉదాహరణకు, శనిగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల ఆయా జాతకులకు ఒక ఏడాదిలో నిర్దిష్ట రంగాల షేర్లు లాభించకపోవచ్చు. అదే గ్రహం సానుకూలంగా మారిన తర్వాత మరుసటి ఏడాది అవే స్టాక్స్ లాభించనూ వచ్చని గణేశస్పీక్స్‌డాట్‌కామ్ వర్గాలు చెబుతున్నాయి. కనుక ఎవరికి ఏ గ్రహం ఎప్పుడు ఎలా అనుకూలిస్తోందో.. వారికి ఏయే స్టాక్స్ అనుకూలంగా ఉంటాయోనన్నది ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసి మరీ సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాబట్టి ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని, బోలెడంత శ్రమ ఉంటుందని ఆస్ట్రాలజర్లు చెబుతున్నారు. మార్కెట్లను ప్రతి క్షణం, ప్రతి నిమిషం ట్రాక్ చేయడం ద్వారా అనలిస్టుల కన్నా మెరుగైన సలహాలు ఇవ్వగలుగుతున్నామంటున్నారు వారు.
సాఫ్ట్‌వేర్స్ కూడా ఉన్నాయి..
ప్రస్తుతం అనేకానేక ఆస్ట్రాలజీ వెబ్‌సైట్లు.. అనేక రకాల సర్వీసులు అందిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్లు కూడా ఉన్నాయి. లియో స్టార్, కుండలి మొదలైనవి ఇందులో ఉన్నాయి. వీటి ధరలు రూ. 5,000 మొదలుకుని రూ. 30,000 దాకా ఉన్నాయి.
సర్వీస్ బట్టి ఫీజులు..
సాఫ్ట్‌వేర్‌లతో కుస్తీ పడేంత సమయమూ, ఓపిక లేని వారికోసం ఆస్ట్రాలజీ వెబ్‌సైట్లు డెయిలీ న్యూస్‌లెటర్స్ మొదలుకుని ఎస్‌ఎంఎస్ అలర్టుల దాకా వివిధ రూపాల్లో స్టాక్ అలర్టులు పంపిస్తున్నాయి. సర్వీసును బట్టి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు..ఆస్ట్రోస్టాక్‌టిప్స్‌డాట్‌ఇన్ అనే వెబ్‌సైటు రోజూ ఎస్‌ఎంఎస్‌లు పంపించే సర్వీసుకు సంబంధించి నెల వ్యవధి నుంచి ఏడాది వ్యవధి దాకా రూ.11,000- రూ.1,10,000 దాకా వసూలు చేస్తోంది.
అదే వారంవారీ ఆప్షన్‌ని ఎంచుకుంటే రెండేళ్లకు రూ.20,000 చొప్పున చార్జీ చేస్తోంది. అలాగే ఇన్వెస్టరు, సర్వీసును బట్టి ఆస్ట్రోమనీగురుడాట్‌కామ్ సైటు ఏడాదికి రూ.30,000 నుంచి రూ. 1,10,000 దాకా వసూలు చేస్తోంది.
ఆస్ట్రోమనీగురుడాట్‌కామ్ సీఈవో అజయ్ జైన్ పలు వెబ్‌సైట్లకు రాయడంతో పాటు బిజినెస్ చానల్ బ్లూమ్‌బర్గ్ టీవీలో గెస్ట్‌గా కూడా వచ్చి స్టాక్‌మార్కెట్స్ టిప్స్ ఇస్తుంటారు. ఆయన సంస్థ కేవలం స్టాక్స్ మాత్రమే కాకుండా ఫారెక్స్, పసిడి, ముడిచమురు వంటి ఇతర కమోడిటీలపైన కూడా సలహాలు ఇస్తుంటుంది. ఆయన కు ప్రస్తుతం 3,000 పైచిలుకు క్లయింట్లు ఉన్నారు. గడిచిన అయిదేళ్లలో వ్యాపారం ఏటా 25-30 శాతం మేర పెరిగిందట.