ఐదో రోజూ రూపాయికి బలం
ముంబై: రూపాయి విలువ వరుసగా ఐదో రోజూ పుంజుకుంది. దేశీ మార్కెట్లలోకి విదేశీ నిధుల ప్రవాహం పెంచేలా ఆర్‌బీఐ చేపట్టిన తాజా చర్యలకుతోడు... సిరియాపై యుద్ధ ఆందోళనలు శాంతించడం దేశీ కరెన్సీకి బలాన్నిచ్చింది. దీంతో బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ మరో 46 పైసలు ఎగబాకి 63.38 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతుండటం, ఎగుమతిదారుల నుంచి డాలర్ విక్రయాలు కూడా రూపాయికి బూస్ట్ ఇచ్చినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
బ్యాంకులు విదేశీ నిధుల సమీకరణ నిబంధనల సడలింపు ఇతరత్రా చర్యలను ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించడం తెలిసిందే. మరోపక్క, సిరియాలో రసాయన ఆయుధాల నిర్మూలనకు దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొనడంతో ముడిచమురు రేట్లు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 111 డాలర్లకు(బ్యారెల్) చేరింది. కాగా, వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ 425 పైసలు(6.28%) ఎగబాకడం గమనార్హం. గత నెల 28న దేశీ కరెన్సీ ఆల్‌టైమ్ కనిష్టానికి(68.80) పడిపోవడం విదితమే.