
అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆర్‌బీఐ కీలక రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించడం స్టాక్ మార్కెట్‌కు షాక్‌నిచ్చింది. పైగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వృద్ధి, ద్రవ్యోల్బణంపై వీటి ప్రభావం తీవ్ర స్థాయిలోనే ఉండనున్నదని ఆర్‌బీఐ హెచ్చరించడం మరింత కలవరపరిచింది. కీలక రేట్లను పెంచకపోవడంతో డాలర్‌తో రూపాయి మారకం 74 మార్క్‌ను దాటింది. ప్రపంచ మార్కెట్ల పతనం కూడా ప్రభావం చూపడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టాలు వచ్చాయి. రేట్ల ప్రకటన వరకూ ఒక స్థాయి నష్టాల్లో కదలాడిన స్టాక్ మార్కెట్, ప్రకటన అనంతరం భారీగా నష్టపోయింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 35వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. స్టాక్ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడోరోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్792 పాయింట్లు (2.25 శాతం) నష్టపోయి 34,377 పాయింట్ల వద్ద, ఎన్ ఎస్‌ఈ నిఫ్టీ 283 పాయింట్లు (2.67 శాతం) పతనమై 10,316 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 967 పాయింట్లు, నిప్టీ 336 పాయింట్ల వరకూ నష్టపోయాయి.
వారం వారీ చూస్తే... రెండేళ్లలో భారీ నష్టాలిప్పుడే
ఈ వారంలో స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,850 పాయింట్లు (5.1 శాతం), నిఫ్టీ 614 పాయింట్లు (5.50 శాతం) చొప్పున క్షీణించాయి. ఒక్క వారంలో స్టాక్ సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. వరుసగా ఐదో వారమూ స్టాక్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఈ ఏడాది ఆగస్టు 28న స్టాక్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 4,600 పాయింట్లు, నిఫ్టీ 1,400 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఈ ఏడాది సెన్సెక్స్ సాధించిన లాభాలన్నీ దాదాపు హరించుకుపోయాయి. సెన్సెక్స్ మరో 68 పాయింట్లు పతనమైతే, నెగిటివ్ జోన్‌లోకి జారిపోతుందని విశ్లేషకులంటున్నారు.
రోజంతా నష్టాలే...
సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది.ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 967 పాయింట్లు నష్టపోయి 34,202 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. విపత్కర పరిస్థితుల్లో ఆదుకునే షేర్లుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం.. షేర్లు కూడా పతనమవడంతో సెన్సెక్స్‌కు భారీ నష్టాలు తప్పలేదు. రూపాయి మరింత బలహీనపడటం వల్ల ద్రవ్యలోటు భయాలు మరింతగా ఎగిశాయని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
తదుపరి మద్దతు 10,100 పాయింట్లు...?
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఓవర్ సోల్డ్ పొజిషన్లు ఉన్నందున సాంకేతికంగా రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకునే అవకాశాలున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్, జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. మొత్తం మీద చూస్తే... సెంటిమెంట్ బేరిష్‌గానే ఉందని, పెరిగినప్పుడల్లా అమ్మేయాలనే వ్యూహాన్ని ట్రేడర్లు అనుసరించాలని, షేర్ల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మరోవైపు నిఫ్టీ కీలకమైన 10,400–10,350 మద్దతు స్థాయిలను కోల్పోయిందని, తదుపరి మద్దతు స్థాయి 10,100 పాయింట్లని కొంతమంది నిపుణులు పేర్కొన్నారు.
ఆశ్చర్యపరిచిన ఆర్‌బీఐ ‘పాలసీ’
డాలర్‌తో రూపాయి మారకం ప్రతి రోజూ జీవిత కాల కనిష్ట స్థాయిలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో తన పాలసీలో కీలక రేట్లను ఆర్‌బీఐ తప్పక సవరిస్తుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. రెపో రేటు పెంచటం, బ్యాంకులకు మరింత నగదు అందుబాటులో ఉండేలా క్యాష్ రిజర్వ్ రేషియోను (సీఆర్‌ఆర్) తగ్గించటం వంటివి చేస్తుందనే అంచనాలున్నాయి. దీనికి భిన్నంగా ఆర్‌బీఐ రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించింది. దీంతో రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ను దాటేసింది. ఇంట్రాడేలో 65 పైసల నష్టంతో 74.23 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత కోలుకుని గురువారం నాటి ముగింపుతో పోల్చితే 18 పైసల నష్టంతో 73.76 వద్ద ముగిసింది. మరోవైపు రేట్లపై నిర్ణయానికి ప్రస్తుతం అనుసరిస్తున్న తటస్థ విధానాన్ని విడనాడి డేటాను బట్టి అనుగుణ్యమైన నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అనుసరించనున్నామని ఆర్‌బీఐ వెల్లడించడం కూడా స్టాక్ మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.
అధఃపాతాళానికి ఆయిల్ షేర్లు
ఆయిల్ షేర్ల నష్టాలు శుక్రవారం కూడా కొనసాగాయి. భారం తగ్గించామని, ఆయిల్ కంపెనీలు కూడా లీటర్‌కు రూ.1 భారం భరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురు
వారం సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ధరలను నిర్ణస్తున్నాయి. జైట్లీ తాజా వ్యాఖ్యలతో ఇంధన ధరలపై మళ్లీ ప్రభుత్వ నియంత్రణ వస్తుందనే ఆందోళనలతో ఈ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు పలు రేటింగ్ సంస్థలు ఈ షేర్ల రేటింగ్‌లను తగ్గించాయి. హెచ్‌పీసీఎల్ 25 శాతం పతనమై రూ.165 వద్ద, బీపీసీఎల్ 21 శాతం తగ్గి రూ.265 వద్ద, ఐఓసీ 17 శాతం నష్టపోయి రూ.118 వద్ద, ఓఎన్‌జీసీ 16 శాతం పడిపోయి రూ.147 వద్ద, గెయిల్ 10 శాతం పతనమై రూ.331 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో ఈ షేర్లన్నీ తాజాగా ఏడాది కనిష్ట స్థాయిలను కూడా తాకాయి. కాగా లీటర్‌కు రూ.1 తగ్గించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల నికర లాభం రూ.4,500 కోట్లు, స్థూల లాభం రూ.9,000 కోట్ల మేర తగ్గుతుందని అంచనా. కానీ జైట్లీ వ్యాఖ్యలతో ఆయిల్ కంపెనీల మార్కెట్ క్యాప్ గడిచిన రెండు రోజుల్లో రూ.2 లక్షల కోట్ల వరకూ ఆవిరై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక కూడా ఊడిపోయిందన్నట్లుగా జైట్లీ వ్యాఖ్యల కారణంగా ఆయిల్ కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పతనమైందని వారు పేర్కొన్నారు.
4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ శుక్రవారం నాటికి రూ.136.61 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది దాదాపు సంవత్సరం కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ సోమవారం నుంచి మొత్తం నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు హరించుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment