
సోని కిక్స్ స్పోర్ట్స్.. తెలుగులో
పెప్సీ ఐపీఎల్ మ్యాచ్‌లతో షురూ..
భవిష్యత్తులో స్థానిక క్రీడలు సైతం
చానెల్ బిజినెస్ హెడ్ ప్రసన కృష్ణన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలివిజన్ రంగంలో ఉన్న మల్టీ స్క్రీన్ మీడియా కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ చానల్ ‘సోని కిక్స్’ తెలుగులోనూ కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతున్న పెప్సీ ఐపీఎల్ మ్యాచ్‌లు తెలుగుతోపాటు, తమిళం, బెంగాలీ, హిందీ, ఇంగ్లిషు వ్యాఖ్యానంతో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. భవిష్యత్తులో అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ వంటి క్రీడలు సైతం ఈ భాషల్లో ప్రసారం చేస్తారు. స్థానిక భాషలకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా కొత్త చానల్ ప్రారంభిస్తున్నట్టు సోని కిక్స్ బిజినెస్ హెడ్ ప్రసన కృష్ణన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రముఖ మ్యాచ్‌లు తెలుగులో ప్రసారమవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. క్రికెట్ వీక్షకుల సంఖ్యాపరంగా ముంబై, కోల్‌కతా తర్వాత స్థానం హైదరాబాద్‌దేనని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ వీక్షకులు 55 శాతం మంది ఇంగ్లిషు, 45 శాతం మంది హిందీ ప్రసారాలను చూస్తున్నారని చెప్పారు. గత ఐపీఎల్ మ్యాచ్‌లను మొత్తం 20 కోట్ల మంది వీక్షించారు. స్పోర్ట్స్ చానల్ సోని ికిక్స్‌తోపాటు పలు సోని చానళ్లను మల్టీ స్క్రీన్ మీడియా నిర్వహిస్తోంది.
స్థానిక క్రీడలు సైతం..: సోని కిక్స్ కబడ్డి, ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలపైనా దృషి ్టపెట్టింది. ఆదరణ ఉన్న జాతీయ స్థాయి మ్యాచ్‌లను స్థానిక భాషల్లో ప్రసారం చేయాలని భావిస్తున్నట్టు ప్రసన కృష్ణన్ తెలిపారు. హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ క్రీడాకారులు అత్యధికంగా ఉన్నారని చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, గుంటూరుతోసహా 15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌లను ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కుల్లో భారీ స్క్రీన్లతో ప్రేక్షకులకు మైదానం వంటి అనుభూతిని కలిగిస్తారు. ఒక్కోచోట కనీసం 10 వేల మంది కూర్చోవచ్చు. ప్రవేశం ఉచితం. ఒక్కో నగరంలో రెండు వారాం తాల్లో ఈ పార్కుల్లో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కాగా, ఐపీఎల్ ద్వారా గతంతో పోలిస్తే 20% వృద్ధితో రూ.950 కోట్ల ఆదాయాన్ని సోని ఆశిస్తోంది.