సాక్షి, హైదరాబాద్: దేశంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు పాకిస్తాన్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ నడిపించారు. ఇది చాలదన్నట్టు బెట్టింగ్ సొమ్మును హవాలా మార్గంలో దేశం దాటించారు. ఇందుకోసం బ్యాంకుల్లో ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ ధ్రువపత్రాలతో ఖాతాలు తెరిచారు.
బ్యాంకు అధికారుల వత్తాసుతో కోట్ల కొద్దీ సొమ్మును వేరే దేశాలకు చేర్చారు. 2013, 2019 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో జరిగిన బెట్టింగ్‌లోని చీకటి కోణాలివి. ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన రెండు బెట్టింగ్ కేసుల్లో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
కోట్ల లావాదేవీలపై పట్టింపేది?
ఢిల్లీకి చెందిన దిలీప్‌కుమార్.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన గుర్రం సతీశ్, గుర్రం వాసుతో కలిసి పాకిస్తాన్‌లో ఉన్న వకాస్ మాలిక్‌తో నేరుగా టెలిఫోన్ సంభాషణలు సాగించారు. క్రికెట్ బెట్టింగ్ కోసం పలు జాతీయ బ్యాంకుల్లో నకిలీ ధ్రువపత్రాలతో ఖాతాలు తెరిచారు. ఎలాంటి వ్యాపారం లేని సతీశ్, వాసు.. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాలు తెరిచారు.
ఢిల్లీలోని దిలీప్‌కుమార్ ఖాతాల ద్వారా 2013, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.49 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ డబ్బు బెట్టింగ్ ద్వారా వచ్చిందేనని సీబీఐ గుర్తించింది. సతీశ్ 2012–13, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో రూ.4.55 కోట్ల బెట్టింగ్ లావాదేవీలు జరిపాడని, విదేశాల నుంచి రూ.3.05 లక్షలను బెట్టింగ్ కోసం తీసుకున్నాడని సీబీఐ గుర్తించింది. వాసు అకౌంట్ల నుంచి 2012–13, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.37 కోట్ల లావాదేవీలు జరిగినట్టు దర్యాప్తు విభాగం వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ డబ్బును హవాలా రూపంలో వకాస్ మాలిక్ చెప్పిన దేశాలకు పంపినట్టు సీబీఐ ఆరోపిస్తోంది.
నిద్రపోయారా.. నటించారా?
ఇంత పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగు తుంటే బ్యాంకు అధికారులు నిద్రపోయారా లేదా నటించారా అన్న కోణంలో సీబీఐ కూపీ లాగు తోంది. సామాన్యుడు ఖాతా తెరవాలంటే సవాలక్ష పత్రాలు అడిగే బ్యాంకు అధికారులు.. నకిలీ బర్త్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాలు సమర్పించిన దిలీప్‌కుమార్‌తో పాటు గుర్రం సతీశ్, వాసులను ఎందుకు గుర్తించలేదు? ఆ పత్రాలు అసలువా, నకిలీవా ఎందుకు విచారించలేదని సీబీఐ అనుమానిస్తోంది.
పైగా ఈ ముగ్గురూ కేవలం సేవింగ్ పేరుతో తెరిచిన ఖాతాలో రూ.11 కోట్ల మేర నగదు లావాదేవీల వ్యవహారాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు, ఏటా జరిగే ఆడిటింగ్‌లో ఎందుకు ఇది బయటపడలేదో సీబీఐ అధికారులను విస్తుపోయేలా చేస్తున్నట్టు తెలిసింది.
బ్యాంకు అధికారులపై నజర్
సీబీఐ ఢిల్లీ విభాగం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానం వ్యక్తం చేసింది. అంతే కాదు ‘అనుమానిత ప్రభుత్వ ఉద్యోగులు’ అని కూడా పేర్కొంది. దీనితో సంబంధిత బ్యాంకుల్లోని అధికారుల్లో వణుకు మొదలైనట్టు తెలుస్తోంది.
నిందితులకు సహకరించి ఖాతాల తెరిచిన దగ్గరి నుంచి డబ్బు విదేశాలకు తరలివెళ్లిన వ్యవహారాల్లో ఏయే స్థాయి అధికారు లున్నారో సీబీఐ విచారించబోతోంది. దీంతో దిలీప్‌కుమార్, సతీశ్, వాసు నకిలీ పత్రాలతో ఖాతాలు తెరిచిన బ్యాంకు బ్రాంచుల్లో సోదాలు చేసేందుకు సీబీఐ సమాయత్తమవుతున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment