సాక్షి, హైదరాబాద్: రేపు విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఆమె.. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు వర్చువల్‌గా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.
‘‘గతంలో సెక్షన్ 160 నోటీసుకు, 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. ఎన్నికల తరుణంలో నోటీసులు ఇవ్వడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోంది. సీబీఐ ఆరోపణల్లో నా పాత్ర లేదు.. పైగా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.’’ అని లేఖలో కవిత పేర్కొన్నారు.
‘‘ఈడీ నోటీసులపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా.. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పారు. సుప్రీంకోర్టులో హామీ సీబీఐకి కూడా వర్తిస్తుంది. సీబీఐ బృందం నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించా. సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా సహకరిస్తా. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం.. సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎంపీ ఎన్నికల దృష్ట్యా మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటా. నా షెడ్యూల్ దృష్ట్యా రేపు విచారణకు హాజరుకాలేను’’ అని కవిత లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన మలుపు
Comments
Please login to add a commentAdd a comment