ట్రంప్ గెలిస్తే.. అమెరికా నాశనమవుతుందట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేస్తానని, వారిపై పోరాటానికి అదనంగా మరో 30 వేల యూఎస్ ట్రూప్లను పంపుతానని, బాంబులు వేయిస్తానని ప్రచారంలో విరుచుకుపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు ఊహించని మద్దతు వచ్చింది. ట్రంప్ నాశనం చేస్తానని చెబుతున్న ఐఎస్ ఉగ్రవాదులే అమెరికా ఎన్నికల్లో ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గాక ట్రంప్ విజయం సాధించాలని ఎదురు చూస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయితే ఆయన వల్ల అమెరికా నాశనం అవుతుందని జిహాదీలు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఐఎస్కు చెందిన మీడియాలో జిహాదీల ఇంటర్వ్యూలు వచ్చాయి.
ట్రంప్ వైట్హౌస్లో అడుగుపెడితే ఆయన నాయకత్వంలో అమెరికాను స్వీయవినాశనం దిశగా నడిపిస్తారని ఐఎస్ జిహాదీలు విశ్వసిస్తున్నారు. ట్రంప్ నిలకడలేని మనిషని, చంచలస్వభావంతో ఆయన తీసుకునే దూకుడు నిర్ణయాలు అమెరికాను బలహీనం చేస్తాయని నమ్ముతున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తాడని, దీనివల్ల ముస్లిం సమాజం ఏకమవుతుందని, ఇది ఐఎస్కు ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్టు మీడియా కథనం. అప్పుడు ఇస్లామిక్ టీమ్, యాంటీ ఇస్లామిక్ టీమ్ మధ్య యుద్ధం జరుగుతుందని జిహాదీలు చెబుతున్నారు. హిల్లరీ ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, ట్రంప్ తమ శత్రువని ఐఎస్ మద్దతుదారులు పేర్కొన్నారు. ట్రంప్ను గెలిపించాల్సిందిగా దేవుణ్ని కోరుకుంటున్నట్టు ఓ మద్దతుదారుడు చెప్పాడు.