భారత్పై దాడికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు?
ఇటీవలి కాలంలో అత్యంత ప్రమాదకారిగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ భారత దేశం మీద కూడా దాడులు చేసేందుకు సిద్ధమవుతోందా? పాకిస్థానీ, అఫ్ఘాన్ తాలిబన్ వర్గాలను కూడా కలిపేసుకుని అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా మారేందుకు సన్నాహాలు చేసుకుంటోందా? 'యూఎస్ఏ టుడే' పత్రిక ప్రచురించిన కథనం అవుననే అంటోంది. పాకిస్థానీ తాలిబన్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న ఓ పాకిస్థానీ పౌరుడి నుంచి సేకరించిన 32 పేజీల ఉర్దూ డాక్యుమెంటులోని వివరాలను బట్టి చూస్తే ఇదంతా నిజమేనని తెలుస్తున్నట్లు ఆ కథనం తెలిపింది.
భారతదేశంపై దాడి చేయడానికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు చేసుకుంటోందని పేర్కొంది. అమెరికా తన మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని దాడులు చేయడానికి ప్రయత్నించినా కూడా.. ముస్లిం శక్తులు అన్నీ ఏకమవుతాయని, దాంతో పెద్ద యుద్ధం తప్పదని యూఎస్ఏ టుడే కథనం వివరించింది. భారతదేశం మీద దాడి చేస్తే ఐఎస్ఐఎస్ స్థాయి పెరుగుతుందని, ఆ ప్రాంతంలో సుస్థిరతకు అది ముప్పుగా పరిణమిల్లుతుందని రిటైర్డ్ సీఐఏ అధికారి బ్రూస్ రీడెల్ తెలిపారు. ప్రస్తుతం వివిధ వర్గాలుగా చీలిపోయి ఉన్న పాకిస్థానీ, అఫ్ఘాన్ తాలిబన్లంతా కలిసి ఒక ఉగ్రసైన్యంగా రూపొందాలని కూడా ఆ డాక్యుమెంటులో పిలుపునిచ్చారు. ప్రపంచంలోని వందకోట్ల ముస్లింలు అంతా కలిసి ఒక 'ఖలీఫా' కిందకు రావాలని కూడా అందులో అభిలషించారు. అల్ కాయిదా కూడా తమ గ్రూపులో చేరాలన్నారు.
ఈ పరిస్థితి మొత్తాన్ని వైట్ హౌస్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ డాక్యుమెంటులో ఉపయోగించిన భాష గానీ, పదాలు గానీ అన్నీ కూడా ఇంతకుముందు ఐఎస్ఐఎస్ విడుదల చేసిన పత్రాలను పోలి ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ చూస్తే భారతదేశం మీద దాడి చేయడానికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు చేసుకుంటోందనే అనుకోవాలి. అయితే.. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. ఇప్పటివరకు ఐఎస్ఐఎస్ తమ దేశం మీద దాడి చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు.