- యూఎస్ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతిదాడి
- ఎనిమిది మంది మృతి, ముగ్గురు జవాన్లకు గాయలు
- అఫ్ఘాన్ రాజధాని కాబుల్ లో సంఘటన
కాబుల్: ముప్పేటదాడితో కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న ఐసిస్ మళ్లీ పంజా విసిరింది. ఈ సారి ఏకంగా అమెరికన్ ఆర్మీనే టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ లో గల అమెరికన్ ఎంబసీ ఎదుట బుధవారం ఐసిస్ జరిపిన దాడిలో ఎనిమిదిమంది మరణించగా, ముగ్గురు యూఎస్ జవాన్లు తీవ్రంగా గాపడ్డారు. అఫ్ఘాన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్ దానిశ్ చెప్పిన వివరాల ప్రకారం..
కాబుల్ లోని యూఎస్ ఎంబసీ ఎదుట ఆర్మీ కాన్వాయ్ పై ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడి చేశారు. ఉగ్రవాదులు వినియోగించినవి శక్తిమంతమైన బాంబులు కావడంతో పేలుడు ధాటికి ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యూఎస్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు ప్రతినిధులు తెలిపారు. పేలుడు ధాటికి యూఎస్ ఆర్మీకి చెందిన రష్ అవర్ వాహనంతోపాటు పౌరులకు చెందిన మరో 25 వాహనాలు ధ్వంసం అయ్యాయి. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
అమెరికా, రష్యా, సిరియా, ఇరాన్ జాతీయ బలగాల ముప్పేటదాడితో చావుదెబ్బతిన్న ఐసిస్.. ఇటీవల ఇరాక్, సిరియాలకంటే అఫ్ఘానిస్థాన్ లోనే తన ప్రభావాన్ని చాటుకుంటోంది. అఫ్ఘాన్ యుద్ధం తర్వాత కూడా సుదీర్ఘకాలం పనిచేసిన అమెరికా, నాటో సైన్యాలు 2014 నుంచి తిరుగుముఖం పట్టడం, అదే సమయంలో ఉగ్రసంస్థలు మళ్లీ పుంజుకుంటుండటం తెలిసిందే.