పన్ను ఎగవేత సంస్థలపై కన్నెర్ర | IT department to name and shame 31 big tax defaulters | Sakshi
Sakshi News home page

పన్ను ఎగవేత సంస్థలపై కన్నెర్ర

Published Thu, Apr 16 2015 2:27 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

పన్ను ఎగవేత సంస్థలపై కన్నెర్ర - Sakshi

పన్ను ఎగవేత సంస్థలపై కన్నెర్ర

31 డిఫాల్టర్ల పేర్లతో రెండో జాబితా విడుదల చేసిన ఐటీ శాఖ
 చెల్లించాల్సిన మొత్తం రూ.1,500 కోట్లు
 హైదరాబాద్ కంపెనీలూ ఉన్నాయ్
 
 న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ బుధవారం పన్ను ఎగవేతలకు సంబంధించి రెండవ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 31 పేర్లు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆయా సంస్థలు చెల్లించాల్సిన మొత్తం రూ.1,500 కోట్లు. వీటిలో కొన్ని కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించినవీ ఉన్నాయి.  నెల రోజుల్లో ఇది ‘డిఫాల్టర్ల’ రెండవ జాబితా.  ఇటీవలే 18  ‘ట్యాక్స్ డిఫాల్ట్’ సంస్థల జాబితాను ఐటీ  విడుదల చేసింది. సీబీడీటీ వెబ్‌సైట్‌లో డిఫాల్టర్ల జాబితాను పోస్ట్ చేశారు.
 
 ఇవీ కొన్ని సంస్థలు...
 హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టోటెమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రూ.402 కోట్లు), ఇదే నగరం కేంద్రంగా ఉన్న మరో కంపెనీ రాయల్ ఫ్యాబ్రిక్స్ (రూ.159 కోట్లు) జాబితా లో ఉన్నాయి. పూణేకు చెందిన పతేజా బ్రోస్ ఫోర్జింగ్ అండ్ ఆటో పార్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (రూ.224 కోట్లు), ముంబైకి చెందిన హోమ్ ట్రేడ్ (రూ.72 కోట్లు) జాబితాలో ఉన్న మరికొన్ని కంపెనీలు.
 
 జాడ తెలిస్తే తెలపండి...
 రూ.10 కోట్ల పైబడిన ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారుల జాబితాను ప్రకటిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.  పలు కేసుల్లో అసెస్సీల(పన్ను చెల్లింపుదారులు) జాడ కూడా తెలియడం లేదని వివరించారు. కొన్ని కంపెనీలకు సంబంధించి రికవరీకి తగిన ఆస్తులు లేవని కూడా పేర్కొన్నారు.  ఎగవేతదారులకు సంబంధించి పాన్ నంబర్‌ను, అలాగే చివరిసారిగా అందుబాటులో ఉన్న  డిఫాల్టర్ల చిరునామాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారి తెలిపారు. వీరి గురించి తెలిస్తే, సమాచారం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.  ఈ జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించిన అసెస్సీలు ఎక్కడ ఉన్నా... తక్షణం పన్ను బకాయిలను చెల్లించాలని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘నేమింగ్ అండ్ షేమింగ్’ విధానం కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను ఇలా ఎప్పటికప్పుడు వెల్లడించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పార్లమెంటులో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం, 2014 డిసెంబర్‌నాటికి కార్పొరేట్ పన్ను బకాయిల విలువ దాదాపు రూ.3,11,080 కోట్లు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement