సత్యం.. శివం.. సుందరం
సత్యం.. శివం.. సుందరం. ఐటీ రంగంలో త్రిమూర్తులు సత్య నాదెళ్ల, శివ నాడార్, సుందర్ పిచాయ్ వెలిగిపోతున్నారు. తెలుగుతేజం సత్య నాదెళ్ల ప్రఖ్యాత మైక్రోసాప్ట్ సీఈఓగా .. తమిళులు శివ నాడర్ దేశీయ సాఫ్ట్వేర్ సంస్థల దిగ్గజం హెచ్సీఎల్ చైర్మన్గా, సుందర్ పిచాయ్ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓగా.. ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. ఐటీ అంటేనే భారత్ అంటూ ప్రపంచం గుర్తించేలా చేశారు. అంతర్జాతీయ ఐటీ రంగంలో భారత్ది ప్రత్యేక స్థానం.
సత్య నాదెళ్ల..
మైక్రోసాప్ట్ సీఈఓ పదవి తెలుగువాడికి దక్కింది. సాప్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ వారసుడిగా మైక్రోసాప్ట్ కార్పోరేషన్ కొత్త సీఈఓగా హైదరాబాద్కు చెందిన ప్రవాస భారతీయుడు సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. గత 38 ఏళ్లలో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న సత్య మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన వార్షిక జీతం ప్రసుత్తం 84.3 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు).
శివనాడార్..
1945లో తమిళనాడులోని తూతుకుడి జిల్లా తిరుచెందూరుకు 10 కిలో మీటర్ల సమీపంలో మూలైపొజి గ్రామంలో శివనాడార్ జన్మించారు. కుంభకోణంలో పాఠశాల విద్య అభ్యసించారు. మధురైలోని ద అమెరికన్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ డిగ్రీ, కోయంబత్తూరులోని పీఎస్జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ చేశారు. పుణెలో వాల్చంద్ గ్రూపు కూపర్ ఇంజినీరింగ్ కాలేజీలో కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత మిత్రులతో కలసి 1976లో హెచ్సీఎల్ను స్థాపించారు. ఐటీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా నాడార్కు 2008లో పద్మభూషణ్ అవార్డు వరించింది. విద్యారంగంలోనూ నాడార్ విరాళాలు ఇస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద దాదాపు 88 వేల కోట్ల రూపాయలు.
సుందర్ పిచాయ్..
అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగంలో మరో భారత సంతతి వ్యక్తి అత్యున్నత పదవి అలంకరించారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ (43) ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా నియమితులయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. ఆయన ఐఐటీ- ఖరగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను సుందర్ పొందారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. ఆయన వార్షిక జీతం రూ. 310 కోట్లు.