
ఐటీ పరిమితి రూ. 5 లక్షలకు పెంచాలి
న్యూఢిల్లీ: వేతన జీవులకు ఊరటనిచ్చే విధంగా రాబోయే బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల దాకా పెంచాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని అభ్యర్ధించాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో 11 ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు కార్మిక సంఘాల విజ్ఞప్తులను సమర్పించారు. ఖాయిలా పడినప్పటికీ మళ్లీ మెరుగుపడే అవకాశాలున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని బడ్జెట్‌లో ప్రకటించాలని అభ్యర్థించారు.
ద్రవ్యోల్బణ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అటు కమోడిటీల్లో ఫార్వర్డ్ ట్రేడింగ్‌ను నిషేధించాల ని, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు.. సుంకాలను క్రమబద్ధీకరించాలని ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడానికి తాము వ్యతిరేకమని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.రైల్వేను ప్రైవేటీకరించం..: కాగా రైల్వేని గానీ కోల్ ఇండియాను గానీ ప్రైవేటీకరించే యోచనేదీ లేద ని అరుణ్ జైట్లీ మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఆదాయం పెంచుకోవడం కోసం అధిక పన్నులు వడ్డించడానికి తాము వ్యతిరేకమని జైట్లీ చెప్పారు.