విభజనను ప్రతిఘటించాలి: వైఎస్ జగన్ | Jagan Mohan Reddy meets Rajnath Singh, seeks support against Andhra split | Sakshi
Sakshi News home page

విభజనను ప్రతిఘటించాలి: వైఎస్ జగన్

Published Sat, Feb 15 2014 1:35 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

విభజనను ప్రతిఘటించాలి: వైఎస్ జగన్ - Sakshi

విభజనను ప్రతిఘటించాలి: వైఎస్ జగన్

* కాంగ్రెస్ అన్యాయాన్ని అడ్డుకోవాలి
* ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలి
* బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి
 
 సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రతిఘటించటానికి ప్రతిపక్షాలు ఒక్కటిగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రాల విభజన అనేది మొదలుపెడితే.. రేపు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు మరో రాష్ట్రంలోనూ ఇలాగే జరుగుతుందని ఆయన రాజ్‌నాథ్‌కు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రతిపక్షాలు గట్టిగా ప్రతిఘటించాలని కోరారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరిలతో జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు అరగంట పాటు చర్చించారు.
 
 భేటీ అనంతరం జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అన్యాయంగా చేస్తున్న రాష్ట్ర విభజన విషయమై రాజ్‌నాథ్‌ను కలిసి మళ్లీ సవివరంగా చెప్పాం. విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానం లేకుండా.. విభజన బిల్లును అసెంబ్లీ వ్యతిరేకించినప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైతే.. ఆ తరువాత తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలోనూ ఇంకొక రాష్ట్రంలోనూ ఇలాగే జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ రకంగా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ప్రతిపక్షాలు ఒక్కటిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌కు విన్నవించినట్లు తెలిపారు. దీనిపై పార్టీ సహచరులతో మాట్లాడి త్వరగానే సరైన నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారన్నారు.
 
 బీజేపీ నుంచి మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. దేవుడు కూడా వీళ్లందరిలో మంచి చేసే ఆలోచన పుట్టిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘నాకు ఇంకా నమ్మకం ఉంది. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి అవుతాయని, ఒక్కటై గట్టిగా వ్యతిరేకిస్తాయని, మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. దేవుడు కూడా పై నుంచి చూస్తున్నాడు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పార్లమెంటులో ఘర్షణ నేపథ్యంలో విభజన బిల్లు పెట్టుకుండా పునరాలోచించుకోవాలంటారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నిన్న జరిగిన అన్యాయమైతే.. నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉందా? లేదా? అర్థంకాని పరిస్థితి. విభజన వద్దని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యతిరేకించిన పరిస్థితుల్లో.. ఏ రాష్ట్రమైతే విభజనకు ఒప్పుకోవటంలేదో.. ఆ రాష్ట్రాన్ని విడగొట్టటానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’’ అని ఆయన మండిపడ్డారు.
 
 
 పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారట...
 ‘‘పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టేశామని ముగించేస్తారు. సాధారణంగా ఒక బిల్లు ఎక్కడైనా పెట్టినప్పుడు.. దానిని ప్రవేశపెట్టటానికి సభ అంగీకరిస్తోందా? లేదా? చేతులు ఎత్తాలని మొదట అడుగుతారు. అవును.. ప్రవేశపెట్టటానికి అంగీకరిస్తున్నామని సభ్యులు చేతులు పైకి ఎత్తుతారు. లేదు.. ప్రవేశపెట్టటానికి అంగీకరించటం లేదంటూ ‘నో’ అని చేతులు పైకి ఎత్తుతారు. అంగీకరిస్తున్నాం అన్న చేతులు, నో (అంగీకరించటం లేదు) అన్న చేతుల కన్నా ఎక్కువ లేస్తేనే.. బిల్లును సభలో ప్రవేశపెట్టటమనేది జరగాలి. అది సంప్రదాయం. ఆ పద్ధతిలోనే జరగాలి. కానీ ఇక్కడ ఎక్కడ ఎవరు మూవ్ చేశారో తెలియదు. సభకు అంగీకారం అవునా? కాదా? అని అడిగిందీ లేదు. చేతులు పైకి ఎత్తిన దాఖలాలూ లేవు. అయినా పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టటమైందని చెప్పటం నిజంగా చాలా అన్యాయం’’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.
 
 అందరూ షాక్ అయ్యారు...
 ‘అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానంపై కూడా అలానే జరిగింది కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అసెంబ్లీలో ఏం జరిగిందనేది దేశం మొత్తం చూసింది. పార్లమెంటులో ఏం జరిగిందన్నది నా కళ్లెదుటే సాక్షాత్తుగా జరిగితే.. దాని తరువాత ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ,  ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ అందరూ షాక్ అయ్యారు. ఇంత అన్యాయంగా జరిగిన దాఖలాలు వారు ఎప్పుడూ చూడలేదు. సుష్మా, అద్వానీ, నేను, ఎస్‌పీ, బీజేడీ, ఏఐఏడీఎంకే నేతలు అందరం కలిసికట్టుగా వెళ్లి దీన్ని వ్యతిరేకించాం. ఈ రకంగా చేయటం అన్యాయమని చెప్పి వాకౌట్ చేసిన సందర్భం ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తొలిసారిగా అది కూడా గురువారం జరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు.
 
 ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేతకు సహకరిస్తా: బీహార్ సీఎం నితీశ్
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంఘీభావం తెలిపారు. విభజనను అడ్డుకునేందుకు జాతీయ నేతల మద్దతు కూడగడుతున్న ప్రయత్నంలో భాగంగా శుక్రవారం నితీష్‌తో జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రాల విభజనను అడ్డుకునేందుకు జాతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరాన్ని నితీష్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా జగన్ పోరాటానికి నితీష్ సంఘీభావం తెలిపారు. అలాగే లోక్‌సభలో సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement