విభజన సమస్యలు పరిష్కరించండి
కేంద్ర హోంశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు
గడ్కరీ, జైట్లీతో భేటీ
ఛండీగఢ్‌లో నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోందని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీలను ఢిల్లీలోని వారి నివాసాల్లో కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలను వారి దృష్టికి తెచ్చారు. అనంతరం నితిన్‌గడ్కరీ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కోరినట్టు తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో....:
ఏపీని ఒక లాజిస్టిక్ హబ్‌గా తయారు చేసేందుకు రోడ్లు, రైలు మార్గాలను అనుసంధానం చేయాల్సి ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. రాజధాని నుంచి కర్నూలు వరకు ఆరు లేన్ల జాతీయ రహదారి ఇవ్వాలని కోరామన్నారు. విశాఖపట్నం, విజయవాడలలోని బైపాస్ రోడ్డులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు.
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో...:
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తయ్యేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాజధాని నిర్మాణానికి నిధులు విషయంపై చర్చించాం. గతేడాది రెవెన్యూలోటు రావాల్సి ఉందని ఆయన దృష్టికి తెచ్చాం. అన్ని విధాలా సాయం చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు’ అని చంద్రబాబు తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో ఒక సీటును బీజేపీకి ఇస్తున్నామని, తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు వెల్లడించారు. రాజధాని భూమి పూజకు సమయం తక్కువగా ఉన్నందున ఎవరినీ ఆహ్వానించడం లేదని, పని ప్రారంభించేప్పుడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించనున్నట్టు తెలిపారు. పోలవరం నిర్వాసితులందరికీ వీలైనంత సాయం చేస్తామన్నారు.
అందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్:
ప్రభుత్వంతోపాటు అన్ని పక్షాల భాగస్వామ్యంతోనే ‘స్వచ్ఛ భారత్’ విజయవంతం అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంఢీగఢ్‌లో మంగళవారం నిర్వహించిన నీతిఆయోగ్ స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు, ఏడు రాష్ట్రాల నుంచి మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘన, ద్రవ వ్యర్థాలను ఏవిధంగా వాడుకోవాలన్న అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. తదుపరి సమావేశం వచ్చే నెలలో బెంగళూరులో, అనంతరం ఢిల్లీలో ఉంటుందని చంద్రబాబు తెలిపారు.