సాక్షి, అమరావతి, గుంటూరు రూరల్: ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడానికి అంగీకరించి సంతకాలు కూడా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ‘యూటర్న్’ తీసుకుని ప్రత్యేక హోదా అంటూ గోల చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూసే ఉంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన నిధులు తీసుకుంటూనే ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయ నూతన భవన శంకుస్థాపన సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మంగళగిరి వద్ద నిర్మించే నూతన భవనం శిలాఫలకాన్ని సభావేదిక వద్ద నుంచి రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
చంద్రబాబు తీరును ప్రజలు ప్రశ్నించాలి..
‘2016లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల్లో రూ.8,140 కోట్లకు సంబంధించి ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఈఏబీ) రూపంలో మంజూరు అయ్యాయి. మరో రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా త్వరలో కార్యరూపం దాల్చుతాయి. ఒకపక్క ప్రత్యేక ప్యాకేజీ నిధులు పొందుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నాయకులు మరోపక్క ధర్మపోరాటాల పేరుతో ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అంటూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా నినాదం పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. హోదా పేరుతో రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నారు. చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలి’ అని ఆయన అన్నారు.
మాది ప్రత్యేక శ్రద్ధే.. బాబుదే రోజుకో మాట
ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నా తమ మిత్రపక్షంగా కొనసాగుతున్న చంద్రబాబు ఎందుకు కూటమి నుంచి విడిపోయారో తనకు అర్ధం కావడం లేదని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా అనే ఒక పదం పట్టుకొని 2016లో ఒక మాట, 2017లో ఇంకో మాట, ఇప్పుడు మరోమాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిçస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ, ప్రధానమంత్రి అవాస్‌యోజన పథకాల్లో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎక్కువ నిధులు మంజూరు చేస్తోందని వివరించారు. బీజేపీ పొత్తు కొనసాగినా, కొనసాగకపోయినా రాష్ట్ర అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధంగా లేనట్టు కనిపిస్తోందని చెప్పారు.
కాంగ్రెస్ ఉచ్చులో చంద్రబాబు...
కాంగ్రెస్ ఉచ్చులో టీడీపీ చిక్కుకుందని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకుంటే మంచిదని సూచించారు. అంతిమ శ్వాసలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికించడానికి చంద్రబాబు లాంటి వారు ప్రయత్నం చేస్తున్నా ఆ పార్టీ నిరర్థక ఆస్తిగా ఎప్పుడో మారిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ మోదీ మళ్లీ ప్రధాని కాకుండా ఇతరులు ఎవరైనా పర్వాలేదు అన్నట్టుగా పని చేస్తున్నాయని విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ ఎదిగేందుకు రాష్ట్ర ప్రజలు తోడ్పాటునివ్వాలని కోరారు.
నక్సలిజాన్ని రూపుమాపుతున్నాం
మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి చెందడం దురదృష్టకరమని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. తిత్లీ తుఫాన్ కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక పంపితే సాధ్యమైనంత మేర ఆర్థిక సహాయం చేయడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా 25 మంది న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలకు రాజ్‌నాథ్ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు తలపాగా, కత్తి బహుకరించి సన్మానించారు. రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సునీల్‌కుమార్ ఇస్కాకు రాజ్‌నాథ్ శాలువా కప్పి అభినందించారు.
అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి బాబుది: కన్నా
అన్నం పెట్టిన చేతులను నరికే సంస్కృతి చంద్రబాబుదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం రోజూ బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన రూ.1.30 లక్షల కోట్లు, ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను చంద్రబాబు, ఆయన కుమారుడు కొట్టేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మురళీధరన్, బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ వినోద్ సోంకార్, ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు మాణిక్యాలరావు, విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సత్యమూర్తి, సురేష్‌రెడ్డి, జమ్ముల శ్యాంకిషోర్, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, నాగభూషణం, మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్మి షేక్ బాజీ, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాజ్‌నాథ్‌కు రెండు వినతిపత్రాలిచ్చిన టీడీపీ
రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు టీడీపీ ఎంపీలు, మంత్రుల బృందం రెండు వినతిపత్రాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశంపై ఒక వినతిపత్రంతోపాటు తిత్లీ తుపాను తీవ్రతను తెలియచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు రాజ్‌నాథ్‌కు అందచేశారు. తుపాన్ తక్షణ సాయం కింద రూ.1,200 కోట్లు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో గన్నవరం చేరుకున్న రాజ్‌నాథ్‌కు బీజేపీ నేతలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ తదితరులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment