గుంటూరు: గతంలో సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ సుస్థిర ప్రభుత్వాన్ని నడిపిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ ఎస్సీ మోర్చా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆనాడు దేశానికి సుస్థిర పాలన అందించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందన్నారు. పీవీ నరసింహారావు చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని కనీసం పార్టీ కార్యాలయానికి కూడా కాంగ్రెస్ అనుమతించకపోవడం నిజంగా బాధాకరమన్నారు.
ఆనాడు పీవీ నరసింహారావు సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ సుస్థిర ప్రభుత్వాన్ని నడిపారని, నేడు అదే బాటలో బీజేపీ కూడా పయనిస్తోందన్నారు. ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకున్నారన్న రాజ్‌నాథ్.. ఇక ఆ ఉచ్చు నుంచి బయటపడటం అసాధ్యమన్నారు. కాంగ్రెస్ చరిత్రను ఒకసారి ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. మోదీని తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయనీ, కాంగ్రెస్‌ను వెంటిలేటర్ ద్వారా బ్రతికించే యత్నం చంద్రబాబు చేస్తున్నాడన్నారు. ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఎందుకు విడిపోయారో అర్థం కావడం లేదన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం మోదీ కట్టుబడి ఉన్నారని, దీనిలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి స్పెషల్ ట్రీట్‌మెంట్ చేస్తున్నామన్నారు.
తిత్లీ తుఫాను కారణంగా జరిగిన నష్టం నేపధ్యంలో కేంద్రం అన్ని విధాలా రాష్ట్రాన్ని ఆదుకుంటుందని, 2022నాటికి దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి పక్కా గృహం, ప్రతి ఇంటికి విద్యుత్ ఉండేలా మోదీ సర్కారు చర్యలు చేపడుతుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment