టీ-బిల్లుకు మద్దతుపై సర్కారుకు బీజేపీ స్పష్టీకరణ
బీజేపీ అగ్రనేతలతో ప్రధాని మన్మోహన్ విందు సమావేశం
హాజరైన రాజ్‌నాథ్, అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ
విభజన బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రధాని వినతి
మద్దతు అందించటానికి సిద్ధంగా ఉన్నామన్న బీజేపీ నేతలు
అయితే.. ఇరు ప్రాంతాలనూ సంతృప్తి పరచాలంటూ మెలిక
కొత్త రాజధాని సహా పలు ‘సవరణల’ను ప్రస్తావించిన బీజేపీ
సభ్యులను సస్పెండ్ చేయకుండా బిల్లుపై చర్చించాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో మద్దతు అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే ప్రభుత్వం తెలంగాణ, సీమాంధ్ర ప్రజలందరికీ న్యాయం చేయాలని, ఇరు ప్రాంతాలను సంతృప్తి పర్చాలని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బుధవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన బిల్లులో ఈ అంశాలేవీ లేవని.. సీమాంధ్ర ప్రాంతానికి విధులు, నిధులు, అభివృద్ధి విషయంలో ప్రణాళికలకు సంబంధించి బిల్లులో స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ అగ్రనేతలు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు తేల్చిచెప్పారు. బిల్లులోని లోపాలను ఎత్తిచూపుతూ సీమాంధ్రకు న్యాయం కోసం సవరణల చిట్టాను విప్పారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌లోనే రెండు వాదనలు వినిపిస్తున్నారని.. కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులే సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని.. పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్ తీరు ఇలా ఉండగా ప్రతిపక్షాన్ని సహకరించాలని కోరటంలో అర్థంలేదని వారు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రతిపక్షం సహకారం కోరే లక్ష్యంతో ప్రధాని మన్మోహన్ బుధవారం మధ్యాహ్నం తన నివాసం 7 రేస్‌కోర్సులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీలకు మధ్యాహ్న విందు ఇచ్చారు.
దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ, హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ఆర్థికమంత్రి చిదంబరం కూడా పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయసభలూ అంతరాయాలతో వాయిదా పడుతుండటంతో తెలంగాణ బిల్లు సహా పలు కీలక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రధాని ఈ సందర్భంగా బీజేపీ నేతలకు వివరించారు. విభజన బిల్లు ఆమోదానికి బీజేపీ సహకరిస్తే మిగిలిన బిల్లులు కూడా ఆమోదం పొందుతాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి బీజేపీ అగ్రనేతలు స్పందిస్తూ తెలంగాణ బిల్లు విషయంలో తమ వైఖరిని నిర్మొహమాటంగా చెప్తూనే అధికార కాంగ్రెస్ వైఖరిని తూర్పారబట్టినట్లు తెలియవచ్చింది.
బీజేపీ షరతులివీ..
తెలంగాణ, సీమాంధ్ర ప్రజలందరికీ న్యాయం చేయాలి. సీమాంధ్ర ప్రాంతానికి విధులు, నిధులు, అభివృద్ధి విషయంలో ప్రణాళికలకు సంబంధించి బిల్లులో స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ నగరం తెలంగాణలోనే ఉండటం వల్ల, కోస్తాంధ్ర, రాయలసీమలకు దాదాపు రూ. 10 వేల కోట్ల పైన ఆదాయ లోటు ఉంటుంది. దీన్ని ఎలా పూడుస్తారో చెప్పాలి. ఉమ్మడి రాజధానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడాలేదు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయి. ప్రజలు ఒక చోట, రాజధాని ఇంకో చోట ఉండటం వల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయి.
మూడేళ్లకు మించి ఎక్కువ కాలం ఉమ్మడి రాజధానిగా ఉండకూడదని తెలంగాణ నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్రలో రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనేది బిల్లులోనే పొందుపరిస్తే ఇరు ప్రాంతాల వారికి కొంత ఊరట లభిస్తుంది. ఆర్టికల్ 371డీ విషయంలో రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. కోస్తా, రాయలసీమల్లో రెండేసి చొప్పున నాలుగు పట్టణాలను రాజధాని తరహాలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలి. ఇందుకు కేంద్రమే నిధులు సమకూర్చాలి.
బిల్లుతో సవరణలను ప్రవేశపెడతాం: ప్రధాని
‘తెలంగాణ బిల్లులో అన్ని అంశాలూ రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నాయి. అన్ని శాఖలతో, ప్రణాళికాసంఘంతో చర్చించి చేయగలిగిన సవరణలు అన్నీ చేశాం. బీజేపీ ఇచ్చిన సవరణలు కొన్నింటిని కూడా పొందుపరిచాం. వాటిని అధికారిక సవరణల రూపంలో ప్రవేశపెడతాం. పార్లమెంటు ఉభయసభలూ అంతరాయాలతో కొనసాగటం లేదు. దీనివల్ల తెలంగాణ బిల్లుతో పాటు ఇతర కీలక బిల్లులూ పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ బిల్లుకు బీజేపీ సహకరిస్తే.. మిగతా బిల్లులూ ఆమోదం పొందుతాయి’ అని ప్రధాని బీజేపీ నేతలకు వివరించినట్లు సమాచారం.
బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరగాలి: సుష్మా
‘విభజనపై కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయంలేదు. రెండు వాదనలు చేస్తున్నారు. సీఎం కిరణ్ ఢిల్లీ వచ్చి ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. నేతలెవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చనే తీరులో వ్యవహరిస్తున్నారు. అందువల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్ తీరు ఇలా ఉండగా ప్రతిపక్షాన్ని సహకరించాలని కోరటంలో అర్థంలేదు. కీలకమైన విభజన బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరగాలి. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. సభ్యులను సస్పెండ్ చేయకూడదు. సభ్యులను బలవంతంగా బయటకు పంపటం సరికాదు. మేం వ్యతిరేకిస్తాం. ఉభయసభలు సజావుగా సాగితేనే మా మద్దతు ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న తరహాలో అంతరాయాలతో వాయిదా పడితే మేమేమీ చేయలేం’ అంటూ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ కాంగ్రెస్‌ను తూర్పారబట్టినట్లు సమాచారం.
మీవల్ల ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు: అద్వానీ
బీజేపీ సీనియర్ నేత అద్వానీ కూడా కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘సభలు సజావుగా సాగకపోవడానికి అధికార పార్టీ సభ్యులే కారణం. నిన్నటి వరకు కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తే.. బుధవారం మంత్రులు కూడా ఆందోళనకు దిగి సభలను అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదు. గత మూడు దఫాల సమావేశాల నుంచీ ఇదే పరిస్థితి ఉంది. ఎన్‌డీఏ హయాంలో అటల్‌జీ ప్రధానిగా, నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఇచ్చాం. రెండు వైపుల వారూ సంబరాలు చేసుకున్నారు. మేం చేసిన విభజనను దేశం చూసింది. మేం చేసిన విభజనకు మీరే చేస్తున్న విభజనకు మధ్య ఉన్న తేడాను దేశ ప్రజలు చూస్తున్నారు. మీరు చేసిన విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటు సజావుగా జరగటంలేదు. ఇలాంటి పార్లమెంటును నేనేప్పుడూ చూడలేదు’ అంటూ అద్వానీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
న్యాయం చేస్తేనే..!
Published Thu, Feb 13 2014 2:11 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement