* అందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాం: ప్రధాని
* చట్ట ప్రక్రియలకు పదును పెడతామని వెల్లడి
* తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడ్డామని ఉద్ఘాటన
* వీలైనంత త్వరగా బిల్లు పెడతామన్న కమల్‌నాథ్
* శీతాకాల సమావేశాలను పొడిగించే అవకాశం
* క్రిస్మస్ అనంతరం మలివిడత భేటీ!
* సభ్యులతో సంప్రదించి నిర్ణయమన్న మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పునరుద్ఘాటించారు. అంతేగాక, ‘‘పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టేందుకు ప్రయత్నిస్తాం. చట్టప్రక్రియలన్నింటినీ అందుకు పూర్తిగా ఉపయోగించుకుంటాం’’ అని ప్రకటించారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడతారా అన్న మీడియా ప్రశ్నలకు మంగళవారం ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే.
కానీ డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల ఎజెండాలో తెలంగాణ బిల్లు లేదు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా బిల్లు ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రకటించారు.
శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని పార్టీలన్నీ ముక్త కంఠంతో అంగీకరించాయని విలేకరులకు ఆయన వెల్లడించారు. బిల్లును ప్రవేశపెట్టడమే గాక ఈ సమావేశాల్లోనేదానికి ఆమోదం కూడా పొంది తీరాల్సిందేనని లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. అయితే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 దాకా కేవలం 12 రోజుల పాటే జరగనుండటం తెలిసిందే. ఈ స్వల్ప వ్యవధిలోనే 38కి పైగా ముఖ్యమైన బిల్లులను పార్లమెంటు చర్చకు చేపట్టి ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమావేశాలను పొడిగించాలని అఖిలపక్ష భేటీలో పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. దాంతో డిసెంబర్ 20 తర్వాత వారం విరామంతో క్రిస్మస్ అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తోంది.
విస్తృత సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని భేటీ అనంతరం కమల్‌నాథ్ వెల్లడించారు. ‘‘సమావేశాలను పొడిగించాలని పలువురు ఎంపీలు సూచించారు. దీనిపై ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యుల వైఖరి కూడా తెలుసుకోవాలని కేంద్రం భావిస్తోంది’’ అని తెలిపారు. సమావేశాలను పొడిగించాలన్నది పార్టీలన్నింటి ఏకాభిప్రాయమని సుష్మా కూడా చెప్పారు.
తొలి రోజే వాయిదా తీర్మానం?
పలు భారీ కుంభకోణాలు మొదలుకుని ప్రజా సమస్యల దాకా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ సహా విపక్షాలన్నీ సిద్ధమవుతున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలు వేడి పుట్టించడం ఖాయంగా కన్పిస్తోంది. 15వ లోక్‌సభలో అత్యంత తక్కువ కాలం పాటు జరగనున్న సమావేశాలు ఇవే కానున్నాయి. సమావేశాల తొలి రోజైన గురువారమే ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మహిళలపై నానాటికీ పెరుగుతున్న అకృత్యాలు, పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అంతర్గత భద్రత తదితరాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. పలు ఆవశ్యక బిల్లులు సజావుగా ఆమోదం పొందేలా చూసేందుకు విపక్షాలతో ప్రభుత్వం చర్చిస్తోందన్నారు.
మతహింస నిరోధ బిల్లును వ్యతిరేకిస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ బిల్లును సమాఖ్య వ్యవస్థపై దాడిగా పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఇది మత సామరస్యానికే ముప్పుగా పరిణమించవచ్చని ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు 2జీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ కూడా తన నివేదికను పార్లమెంటు ముందుంచనుంది. ఈ వ్యవహారంలో ప్రధానికి జేపీసీ క్లీన్‌చిట్ ఇవ్వడం, టెలికం మాజీ మంత్రి ఎ.రాజాపై నేరం మోపడం వాడివేడి చర్చకు దారి తీసేలా కన్పిస్తోంది. దీన్ని తాము తప్పక లేవనెత్తుతామని బీజేపీ, వామపక్షాలు, డీఎంకే ఇప్పటికే ప్రకటించాయి.
చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు లోక్‌పాల్ బిల్లు ఆమోదం తమ ప్రథమ ప్రాథమ్యమని ప్రభుత్వం ప్రకటించింది. మహిళా బిల్లుకు లోక్‌సభ, లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం లభించాల్సి ఉంది. అయితే మహిళా బిల్లుతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును యూపీఏకు కీలక మద్దతుదారైన సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తుండటం సభలో గందరగోళానికి దారి తీయవచ్చంటున్నారు.
శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు!
Published Wed, Dec 4 2013 2:24 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
Advertisement
Advertisement