టి.బిల్లులో సవరణలు ఉండవు: కమల్నాథ్
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఈరోజు ఆమోదించి తీరుతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ స్పష్టం చేశారు. బిల్లులో ఎలాంటి సవరణలను ఆమోదించబోమని అన్నారు. కీలక బిల్లులు ఆమోదించాల్సివున్నందున్న పార్లమెంట్ సమావేశాలు పొడిగించే అవకాశముందని తెలిపారు. లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ ఎటువంటి సవరణలు ప్రతిపాదించలేదని చెప్పారు. బీజేపీ ప్రతిపాదించిన సవరణలపై ప్రధానితో రాజ్యసభలో ప్రకటన చేయించడం ద్వారా బిల్లును గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాజ్యసభలో బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కమల్నాథ్ తెలిపారు. ఈ దశలో సవరణల ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సీమాంధ్రకు పూర్తి న్యాయం చేయాలన్నఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. సీమాంధ్రకు సంబంధించిన న్యాయసమ్మతమైన అన్ని అంశాలను పరిశీలిస్తామని అన్నారు.