జల్లికట్టు ఎఫెక్ట్: మెట్రో రైలెక్కిన క్రికెటర్
ఎప్పుడూ విమానాలు లేదా మంచి ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉండే క్రికెటర్లు ఉన్నట్టుండి సిటీ బస్సులోనో, మెట్రోరైల్లోనో వెళ్లాల్సి వస్తే ఎలా ఉంటుంది? జల్లికట్టు నిరసనలు జోరుగా జరుగుతున్న చెన్నై నగరంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పటివరకు టెస్ట్, వన్డే సిరీస్‌లతో విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడిన చెన్నై బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. టి-20 సిరీస్‌లో విశ్రాంతి దొరకడంతో సొంతూరికి వెళ్లాడు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి కారులో ఇంటికి వెళ్లడం అసాధ్యం కావడంతో మెట్రోరైలు ఎక్కాడు.
''ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజారవాణా ఉపయోగించి తీరక తప్పదు. నన్ను సురక్షితంగా రైలు ఎక్కించిన ఎయిర్‌పోర్టు పోలీసులకు కృతజ్ఞతలు'' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. దాంతోపాటు తాను మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఫొటోను కూడా ట్విట్టర్‌లో పెట్టాడు. తనను ఇంటికి సురక్షితంగా చేర్చిన అధికారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే సహచర చెన్నైవాసులు కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకుని ఉంటారని ఆశిస్తున్నానన్నాడు.