
జల్లికట్టు.. కొనసాగుతున్న టెన్షన్!
- అసెంబ్లీ నుంచి డీఎంకే, కాంగ్రెస్ వాకౌట్..
- సభ ముందుకు జల్లికట్టు బిల్లు
చెన్నై: తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న వేలాదిమంది యువతను బలవంతంగా అక్కడినుంచి తరలించి.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ నెలకొంది. జల్లికట్టుపై శాశ్వతంగా నిషేధం ఎత్తివేసేవరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. మానవహారంగా ఏర్పడి పోలీసులను వారు ప్రతిఘటిస్తున్నారు.
మరోవైపు జల్లికట్టుపై నిషేధం ఎత్తివేత బిల్లును ప్రవేశపెట్టేందుకు తమిళనాడు అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగియగానే ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి మేరినా బీచ్‌లో ఆందోళనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని స్టాలిన్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మరికాసేపట్లో జల్లికట్టు బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది.