
సీనియర్ నటి కన్నుమూత
చిత్రసీమను విషాదం వెంటాడుతూనే ఉంది.
లండన్: చిత్రసీమను విషాదం వెంటాడుతూనే ఉంది. మొన్నటికి మొన్న జేమ్స్‌బాండ్ నటుడు రోజర్ మూర్ తుదిశ్వాస విడువగా.. తాజాగా జేమ్స్‌బాండ్ నటి మోలీ పీటర్స్ కూడా కన్నుమూసింది. 1965లో వచ్చిన జేమ్స్‌బాండ్ సినిమా ’థండర్‌బాల్’లో సీన్ కానరీ సరసన హీరోయిన్‌గా మోలీ నటించింది. ఆమె మృతిని జేమ్స్‌బాండ్ అధికారిక ట్విట్టర్ పేజీ ధ్రువీకరించింది. 75 ఏళ్ల వయస్సులో మోలీ చనిపోయిందని పేర్కొంటూ ఆమె కుటుంబానికి సంతాపం తెలిపింది. ఆమె ఎలా చనిపోయిందనే విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
1942లో ఇంగ్లండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన మోలీ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ప్లేబాయ్, పరేడ్ వంటి మ్యాగజీన్‌లలో కనిపించిన ఆమెను 23 ఏళ్ల వయస్సులో జేమ్స్ బాండ్ డైరెక్టర్ టెరెన్స్ యంగ్ గుర్తించి.. ‘థండర్‌బాల్’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆమె ‘డోన్ట్ రైజ్ ఆ బ్రిడ్జ్, లోయర్ ద రివర్’ వంటి కామెడీ సినిమాలు, పలు టీవీ షోలలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఏడు జేమ్స్‌బాండ్ సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్‌గా నటించి పర్ఫెక్ట్ బాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజర్ మూర్ 89 ఏళ్ల వయస్సులో ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే.