
తాగుబోతును బాదిన మహిళలపై సీఐ దౌర్జన్యం
తప్పతాగి వీరంగం సృష్టించిన ఓ వ్యక్తిని మహిళలు చితకబాదారు. అనంతరం విచారణ పేరుతో మహిళలపై ఓవర్‌యాక్షన్ చేసిన పోలీసుల తీరు వివాదాస్పదమైంది.
హైదరాబాద్: తప్పతాగి వీరంగం సృష్టించిన ఓ వ్యక్తిని మహిళలు చితకబాదారు. అనంతరం బాధితుడి ఫిర్యాదుమేరకు పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ పేరుతో మహిళలపట్ల వివాదాస్పదరీతిలో ప్రవర్తించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో నివసించే తిరుపతి అనే వ్యక్తి.. తరచూ తప్పతాగి మహిళలను దూషించేవాడు. సోమవారం కూడా అదేపనికి పూనుకోవడంతో కాలనీవాసులంతా కలిసి అతనికి దేహశుద్ధి చేశారు. దీంతో తిరుపతి వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఆ వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు.. విచారణ పేరుతో కాలనీవాసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తోన్న కమలమ్మను, ఆమె బంధువులను సీఐ ఉమామహేశ్వర్ రావు దుర్భాషలాడాడు. అంతటితో ఊరుకోకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు.
తాగుబోతును శిక్షించకుండా, తమను కట్టడం ఏమిటని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకుదిగారు. మహిళా పోలీసులతోనే మహిళలను విచారించాలన్న ఇంగితం మరిచాడంటూ సీఐ ఉమా మహేశ్వర్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వివాదంపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించలేదు.