ఎయిర్ పోర్టులో మంత్రి ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పుణ్యమా అని ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండటం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నిన్నటికినిన్న సమాచార శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉద్యోగుల ఆలస్యంపై మండపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో పౌరవిమాయనయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు.
శుక్రవారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీ టెర్మినల్(టెర్మినల్1) కు వెళ్లిన మంత్రి అక్కడ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాతీశారు. గతవారం ఇదే టెర్మినల్ లో ఎయిర్ కండీషనర్ పనిచేయక ప్రయాణికులు ఉక్కపోతను అనుభవించిన సంఘటన దృష్యా ఏసీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జులై 5 నాటి పునర్ వ్యవస్థీకరణలో ఆర్థిక శాఖ నుంచి పౌరవిమానయానానికి మారిన జశ్వంత్ సిన్హా.. గత వారం దేశీ విమాన సేవల బలోపేతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.