భార్య ఆత్మహత్య: రోహిత్ అరెస్టు
వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకోవడంతో జాతీయ కబడ్డీ చాంపియన్ రోహిత్ చిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రో కబడ్డీ లీగ్‌లో మంచి ఆటగాడిగా పేరున్న రోహిత్ భార్య లలిత ఢిల్లీలోని తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె ఒక సూసైడ్ నోట్, ఆడియో మెసేజ్ కూడా పెట్టింది. ''నేను ఇవి తట్టుకునేంత బలమైనదాన్ని కాను. అందుకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా'' అని అందులో ఉంది. దాంతో ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ చిల్లర్ మీద కేసు నమోదైంది. అతడిని ముంబైలోని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇంతకుముందే ఈ కేసులో లొంగిపోయిన రోహిత్ తండ్రి విజయ్ సింగ్‌ను ఢిల్లీలోని కోర్టులో ప్రవేశపెడతారు.
సోమవారం సాయంత్రం పశ్చిమ ఢిల్లీలోని తన అపార్టుమెంటులో లలిత దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త కోసం రెండు గంటల ఆడియో మెసేజిని, కుటుంబం కోసం ఓ చిన్న మెసేజిని ఆమె రికార్డు చేసింది. తనను కట్నం కోసం చిల్లర్, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తూ కొట్టేవారని అందులో ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే రోహిత్ చిల్లర్‌కు లలితతో మార్చి నెలలో పెళ్లయింది. తన భర్త తరచు తిరుగుతూ ఉంటుండగా, తనను మాత్రం ఢిల్లీలో ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంచారని లలిత ఆరోపించింది.