
టీవీ కూడా లేదు.. రేడియో వినేవారు!
ఆయన దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవి అనుభవించారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పొందారు. అయినా కూడా ఆయన నిరాడంబర జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. కలాం ఇంట్లో టీవీ కూడా లేదట.. కేవలం ఆలిండియా రేడియో విని మాత్రమే ఆయన వార్తలు, విశేషాలు తెలుసుకునేవారట. ఈ విషయాన్ని గత 24 ఏళ్లుగా డాక్టర్ కలాం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న హేరీ షెరిడన్ (53) చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఢిల్లీ నుంచి బయల్దేరేసరికి కలాం ఆరోగ్యం భేషుగ్గా ఉందని, మంగళవారం సాయంత్రం ఆయన తిరిగి రావాల్సి ఉందని అన్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్లు తిరిగి పడిపోయారని ఫోన్ వచ్చిందని తెలిపారు. కాసేపటికే మరో ఫోన్ వచ్చిందని, మిలటరీ వైద్యులు కలాం మరణించినట్లు ప్రకటించారని షెరిడన్ భోరుమన్నారు.
డీఆర్డీఓలో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా కలాం చేరినప్పుడే ఆయన వద్ద సెక్రటరీగా షెరిడన్ చేరారు. ఉదయం 6.30 గంటల నుంచి రేడియో వినడంతో ఆయన దినచర్య ప్రారంభం అయ్యేదని, అర్ధరాత్రి 2 గంటల వరకు మేలుకుని ఉండేవారని చెప్పారు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఈమెయిల్స్ మాత్రం చూసుకునేవారన్నారు. దాదాపు ప్రతివారం ఏదో ఒక సెమినార్కు వెళ్లి వచ్చేవారట.