
'గందరగోళంతో మాకు చెడ్డపేరు తెచ్చే కుట్ర'
హైదరాబాద్: తుని ఘటన విషయంలో సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంబంధం లేని తమ నేతలను సీఐడీ అధికారులు పిలిచి విచారణ చేస్తున్నారని, ఇదంతా ఒక గందరగోళం సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు ప్రభుత్వ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ను నీరు గార్చే పనిలోనే అధికార పార్టీ ఉందని ఆయన అన్నారు.
తుని ఘటన సాకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడ వేస్తోందని , అది ఎన్నటికీ జరగదని, ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలను సహించరని తెలిపారు. 'తొలుత రాయలసీమ వారు దాడి చేశారన్నారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లావారిని అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు నిద్రపోయేవారిని కూడా వదలకుండా స్టేషన్లకు పిలిపించి వేధించారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల ద్వారా ప్రజలను ఏమైనా చేయగలమనే భ్రమల్లో టీడీపీ ఉంది' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తునిలో దివీస్ ల్యాబ్కు విలువైన భూములు 500ఎకరాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కేవలం 5లక్షలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకోవాలని దురాకాంక్షతో అక్కడ మొత్తం పోలీసులను నింపిందని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ విషయంలో వేసిన మంజునాథ కమిషన్ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని, అసలు ఇస్తుందో ఇవ్వదో తెలియదని, ఆ కమిషన్ సభ్యులకు ఇప్పటి వరకు ఒక కుర్చీ కూడా ఇవ్వలేదంటే ప్రభుత్వం ఆ విషయంపై ఎంత సీరియస్ ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.