ప్రతి రైల్వే ప్రమాదంలోనూ కుట్ర కోణం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన వరస రైలు ప్రమాదాల వెనక విధ్వంస కుట్ర దాగి ఉందా? అంటే అవుననే సమాధానం అనే సమాధానం వస్తోంది. 2019 నవంబర్ 20న జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదంపై పాకిస్తాన్ కుట్ర ఉందని ప్రధాని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన సుమారు 40 రైలు దుర్ఘటనల్లో విదేశీ శక్తుల పాత్ర ఉందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ప్రమాదాలను ఎన్‌ఐఏ చేత సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హోం మంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కాన్పూర్‌లో గత నవంబర్‌లో ఇండోర్–పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 150 మంది చనిపోగా వందల మంది గాయాలపాలయ్యారు. ఆ తరువాత డిసెంబర్‌లో సీల్డా–అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ 15 బోగీలు పట్టాలు తప్పడంతో కనీసం 62 మంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగి చోట్ల ఫిష్‌ప్లేట్లు తొలగించి ఉండటం, పట్టాలపై పెద్దపెద్ద విడిభాగాలు పడిఉండటంతో వాటి వెనక బాహ్య శక్తుల పాత్రను అనుమానిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇటీవలే పట్టుబడిన, కాన్పూర్ ప్రమాదానికి కారకునిగా భావిస్తున్న నేపాల్ జాతీయుడు ఐసిస్ కోసం పనిచేస్తున్నాడన్న విషయం వెల్లడవడం అనుమానాలను మరింత పెంచుతోంది.