
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌తో కలిసి కుట్ర చేసిందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆరోపణలు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కొట్టి పారేశారు. అదంతా కేవలం మోదీ తన ప్రచార స్టంట్ కిందనే వాడుకున్నారే తప్ప అవాస్తవం అన్నారు. పాకిస్థాన్‌తో ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. ఇక మోదీ హత్యకు పాక్‌లో సుఫారీ ఇచ్చారని మోదీ చేసిన వ్యాఖ్యలపై బదులు కోరగా ఆయన నవ్వుతూ స్పందించారు.
'మోదీ ఒకసారి ఎవరికీ చెప్పకుండా సర్‌ప్రైజ్ విజిట్ అని లాహోర్ వెళ్లి షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరయ్యారు. అక్కడ భోజనం కూడా చేశారు. అప్పుడేమైనా ఆయన హత్యకు పాకిస్థానీయులు కుట్రలు చేశారా?' అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మోదీ పలు అంశాలను తెరమీదకు తెచ్చి ప్రచారానికి వాడుకున్నారని దుయ్యబట్టారు.