
మా వల్ల కాదు!
నగరంలోని కార్పొరేషన్ సర్కిల్‌లో జ్యోతి ఉదయ్ అనే బ్యాంకు మేనేజర్‌పై గత నెల 19న దాడి జరిగినప్పటికీ, ఆగంతకుని పట్టుకోవడంలో కర్ణాటక, ఆంధ్ర పోలీసులు ఏమాత్రం పురోగతి సాధించలేక పోయారు.
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలోని కార్పొరేషన్ సర్కిల్‌లో జ్యోతి ఉదయ్ అనే బ్యాంకు మేనేజర్‌పై గత నెల 19న దాడి జరిగినప్పటికీ, ఆగంతకుని పట్టుకోవడంలో కర్ణాటక, ఆంధ్ర పోలీసులు ఏమాత్రం పురోగతి సాధించలేక పోయారు. ఆగంతకుడు తొలి నుంచే పోలీసులను తప్పు దారి పట్టించడంలో తాత్కాలికంగా విజయం సాధించినట్లు తెలుస్తోంది.
జ్యోతి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును హిందూపురంలో విక్రయించడం ద్వారా అటు వైపు పోలీసుల దృష్టిని ఆకర్షించడంలో కృతకృత్యుడయ్యాడు. అప్పటి నుంచే కర్ణాటక, ఆంధ్ర పోలీసులు హిందూపురంతో పాటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంయుక్త కార్యాచరణను చేపట్టారు. బహుశా అతను అనంతపురం జిల్లా నుంచే పారిపోయి ఉండవచ్చని ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏటీఎం కేంద్రంలో వేట కత్తితో జ్యోతిపై దాడికి పాల్పడిన అనంతరం తొలుత అతను అనంతపురం జిల్లాకే పారిపోయి ఉంటాడని పోలీసులు అంచనా వేశారు. అక్కడే అతనిని పట్టుకోవచ్చని వెళ్లిన కర్ణాటక పోలీసులు రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు. అలా తిరుగు ముఖం పట్టిన వారిలో జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) హేమంత్ నింబాల్కర్ కూడా ఉన్నారు.
అనంతపురం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో వారంతా ఆగంతకుని పట్టుకునే విషయంలో రోజూ వారీ కార్యకలాపాలను పర్యవేక్షించే వారు. అయితే అతను పట్టుకోగలమనే విశ్వాసం సన్నగిల్లడంతో అక్కడ ఉండడం వృథా అని వెనక్కు వచ్చేసినట్లు తెలిసింది. ఆగంతకుడు బళ్లారి, కోలారు లేదా చిక్కబళ్లాపురం జిల్లాల్లో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ జిల్లాలపై దృష్టిని కేంద్రీకరించారు. కాగా ఆగంతకుని కోసం పూర్తి స్థాయిలో గాలింపు కొనసాగిస్తామని అనంతపురం జిల్లా పోలీసులు హామీ ఇచ్చిన తర్వాతే తాము తిరిగి వచ్చామని కర్ణాటక పోలీసు బృందంలోని ఓ అధికారి తెలిపారు.
దాదాపు మూడు వారాలు గాలించినా ఆగంతకుని గురించి చిన్నపాటి క్లూ కూడా లభించ లేదన్నారు. దీంతో అనంతపురం జిల్లా పోలీసులు కూడా ‘మీరు ఇక్కడ ఉండి ప్రయోజనమేమిటి, ఆగంతకుడు జిల్లా వదలి వెళ్లిపోయినట్లున్నాడు’ అని తమతో అనడంతో వెనక్కు వచ్చేశామని వివరించారు. అయితే ఆగంతకుడు చాలా దూరం వెళ్లి ఉండకపోవచ్చనే అభిప్రాయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. గాలింపు చర్యలు తగ్గు ముఖం పడితే అతను తిరిగి స్వస్థలానికి రావచ్చని, అప్పుడు సులభంగా పట్టుకోవచ్చని వారు భావిస్తున్నారు.
జ్యోతి ఫోన్ సిమ్ కార్డును అతను కేవలం రూ.500కే విక్రయించినందున, ఆర్థికంగా అతను ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కనుక సుదూర ప్రాంతంలో ఎక్కువ కాలం మకాం వేయలేడని కూడా అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ఇక్కడి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతి క్రమంగా కోలుకుంటున్నారు. అయితే ఆమెను డిశ్చార్జి చేయడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఆమె పని చేస్తున్న కార్పొరేషన్ బ్యాంకు వైద్య ఖర్చులను భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.