కమలం గూటికి మాజీ సీఎం కొడుకు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప తనయుడు, కాంగ్రెస్ నాయకుడు కుమార్ బంగారప్ప శుక్రవారం బీజేపీలో చేరారు. ఎంఎస్ కృష్ణ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య సర్కారు తనను పట్టించుకోకపోవడంతో ఆయన కలత చెందారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన మద్దతుదారులతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పను కలిశారు. పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు చెప్పేందుకే యడ్యూప్పను కలిశాసానని, తన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని అప్పుడు చెప్పారు. కుమార్ బంగారప్ప బీజేపీలో చేరడం ఖాయమని అప్పటి నుంచి మీడియాలో ప్రచారం మొదలైంది. ముందుగా ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆయన బీజేపీలో చేరారు.
80, 90 దశకంలో కన్నడ, తెలుగు, ఇంగ్లీషు సినిమాల్లో నటించిన కుమార్ బంగారప్ప యాక్షన్ హీరోగా పేరుగాంచారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా పనిచేశారు. చిన్నవయసులో మంత్రి పదవికి పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు.