సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బీజేపీ అంటే పడనివారు తమపై విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ప్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో బీజేపీ ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. గవర్నర్ న్యాయం ప్రకారమే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ మార్కులు వచ్చినందుకే గవర్నర్ పిలిచారన్నారు. కానీ ఇద్దరు కలిసి మాకు ఎక్కువ మార్కులు వచ్చాయని అంటే ఎలా కుదురుతుందని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు.
గోవాలో కాంగ్రెస్ వారు గవర్నర్‌కి లేఖ కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అయినా ఒక రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో రాష్ట్రం తీసుకోవాలని ఏముందని, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారుతుంటాయని అన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదా అని ఆయన ప్రశ్నించారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.
గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాద ఘటన చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టకుండా బాధితులకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం వెంటనే వాటర్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జల రవాణాకు సంబంధించి బోట్లకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికే ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment