అంతరం
టీడీపీ, బీజేపీల మధ్య కోల్డ్‌వార్
శంకుస్థాపన అనంతరం బయల్పడ్డ వైనం
సీఎం వైఖరితోనే ప్రధానిపై నిందలు
గల్లాపై విరుచుకుపడిన వీర్రాజు
గుంటూరు : అమరావతి శంకుస్థాపన, ఆ తరువాత చోటుచేసుకున్న సంఘటనలు టీడీపీ, బీజేపీల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయనే అభిప్రాయం వినపడుతోంది. శంకుస్థాపన మర్నాడే ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను వివిధ రాజకీయ పార్టీలు దహనం చేయడం వెనుక టీడీపీ వైఫల్యం ఉందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించకపోవడం వలనే ఈ దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు. కేంద్రంలో ఈ రెండు పార్టీలు మిత్రపక్షంగా మెలుగుతుండటంతో పాలనాపరంగా అభిప్రాయభేదాలు ఉన్నా ఇప్పటివరకు ఒక పార్టీపై మరోపార్టీ బాహాటంగా విమర్శలు చేసుకోలేదు. అయితే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివిధ సందర్భాల్లో టీడీపీ వైఖరిపై విమర్శలు చేశారు.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఇతర సీనియర్ నేతలు టీడీపీపై విమర్శలు చేయకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ఉన్న అనుబంధమే కారణంగా చెప్పుకుంటున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తే వెంకయ్య నాయుడు నుంచి ప్రమాదం ఉంటుందనే భయంతో బీజేపీ నేతలు ఎవరూ ఇప్పటి వరకు నోరుమెదపలేదు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం గతంలో కూడా అనేకసార్లు టీడీపీపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనంతో అసహనంగా ఉన్న బీజేపీ నాయకులకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు దృష్టికి గల్లా వ్యాఖ్యలు తీసుకువెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఆదివారం జిల్లాకు వచ్చిన సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి వలనే తమ ప్రధానికి అవమానం జరిగిందని బాహాటంగా విమర్శించారు. గల్లా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సంచలనం సృష్టించిన సోము వీర్రాజు వ్యాఖ్యలు.. ముఖ్యమంత్రి ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం విద్యుత్ కేటాయించడం వలనే విద్యుత్ కోత లేదని, తద్వారా రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, అయితే ఈ విషయాన్ని సీఎం ఎప్పుడూ వివరించలేదని వీర్రాజు ఆరోపించారు. కేంద్రప్రభుత్వ పథకాల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ చిత్రపటం ప్రచురిస్తుంటే, ఏపీలో మిత్రపక్షమై ఉండీ స్వచ్ఛభారత్ వంటి పథకాలలో ప్రధాని బొమ్మను ప్రచురించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ప్రధాని తీరుతో అవమాన పడ్డామని గల్లా వాఖ్యానించటం సరైన విధానం కాదని, దీనిపై ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు టీడీపీ, బీజేపీల్లో సంచలనం కలిగించాయి. రెండు పార్టీల నేతలు ఈ వ్యాఖ్యలపై చర్చించుకున్నారు.