చంపేస్తామంటూ మంత్రికి మాఫియా బెదిరింపులు
పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు ఈ మధ్య మాఫియా నాయకుడు రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇదే కోవలో కర్ణాటక మంత్రి కె. అభయచంద్ర జైన్‌కు కూడా ఈ బెదిరింపులు రావడంతో ఆయనకు భద్రతను పెంచారు. బజరంగ్ దళ్ కార్యకర్త ప్రశాంత్ పూజారి హత్యతో సంబంధం ఉందంటూ అతడు ఆరోపించాడని, అదుకే తనను చంపేస్తామని ఫోన్లో బెదిరించినట్లు రాష్ట్ర క్రీడలు, మత్స్యశాఖ మంత్రి జైన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఖండించారు. ఇదే హత్యలో మరో మంత్రి రామనాథ్ రాయ్ హస్తం కూడా ఉన్నట్లు రవిపూజారి మనిషి తనతో ఫోన్లో చెప్పాడని అభయచంద్ర జైన్ అన్నారు. అతడు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడాడని తెలిపారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని సీఎం సిద్దరామయ్యకు, హోం మంత్రి కేజే జార్జికి కూడా చెప్పానన్నారు. పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ మంత్రి ఇంటికి వెళ్లి.. ఆయనకు అదనపు భద్రత కల్పించాలని ఆదేశించారు.
అక్రమ కబేళాల గుట్టు రట్టు చేసిన ప్రశాంత్ పూజారి (29)ని బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు హత్యచేశారు. యూపీలో దాద్రి హత్య జరిగిన రెండు వారాల తర్వాత ఈ హత్య జరిగింది. ఈ కేసు విచారణపై కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు.