'థ్యాంక్స్ చెప్పేందుకే సోనియాని కలిశా'
న్యూఢిల్లీ : తెలంగాణ కల సాకారం అవటంతో సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకే తాను భేటీ అయినట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. సోనియా పట్టుదల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, తాము కేవలం కృతజ్ఞతలు మాత్రమే తెలిపామన్నారు. ఆదివారం మధ్యాహ్నాం సోనియాతో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి భేటీ అయ్యారు. కేవలం పది నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై సోనియా గాంధీకి నివేదిక ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
రాజకీయ అంశాలపై దిగ్విజయ్ సింగ్‌తో చర్చలు జరపనున్నట్లు కేసీఆర్ తెలిపారు. దిగ్విజయ్తో చర్చల తర్వాతే మరోసారి సోనియాను కలుస్తానని ఆయన చెప్పారు. మరో నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. కెసిఆర్‌తో పాటు కెటిఆర్, కవిత, హరీష్‌రావు సోనియాను కలిసినవారిలో ఉన్నారు.