
'ఆ డబ్బు వెనక్కు తీసుకోం'
తిరువనంతపురం: అగ్రనటుడు మోహన్ లాల్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానన్న డబ్బు తీసుకోబోమని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. 35వ జాతీయ క్రీడలు ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్ లాల్ నేతృత్వంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు నిరాశపరిచాయి. దీంతో ప్రభుత్వం నుంచి తీసుకున్న పారితోషికం(రూ.1.63 కోట్లు) వెనక్కు తిరిగిచ్చేస్తానని మోహన్ లాల్ ప్రకటించారు.
అయితే ఈ డబ్బు తీసుకోబోమని సీఎం చాందీ అన్నారు. నైతికంగా ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. మోహన్ లాల్ ఈ డబ్బు సొంతానికి తీసుకోలేదన్నారు. వేదిక ఖర్చులు, కళాకారుల కోసం ఆయన ఈ మొత్తం తీసుకున్నారని చెప్పారు. ఏదేమైనా వేడుకలపై వివాదం రేగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.