అదృష్టం తన్నుకొస్తే ఇలాగే ఉంటుంది!
అదృష్టం రాసిపెట్టి ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. విమానం దాదాపు కూలిపోయినంత పనై.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడమే ఒక అదృష్టం అయితే.. అంత పెద్ద ప్రమాదం తప్పిన ఆరు రోజులకే ఆరున్నర కోట్ల రూపాయల లాటరీ దక్కడం అంటే ఇంకెంత అదృష్టం అవుతుంది!! కేరళకు చెందిన మహ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ (62)కు సరిగ్గా ఇలాగే జరిగింది. కొచ్చి నుంచి వెళ్లి దుబాయ్ విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయిన విమానం నుంచి బయటపడిన 300 మంది ప్రయాణికుల్లో ఆయనొకరు. దుబాయ్ విమానాశ్రయంలో ఆయన కొన్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ. 6.67 కోట్ల రూపాయల బంపర్ బహుమతి దక్కింది.
ఈద్ సందర్భంగా తన సొంత ఊరు తిరువనంతపురం వెళ్తూ.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఆయనా టికెట్ కొన్నారు. కారు డీలర్ గ్రూపులో ఫ్లీట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ఖదర్ ఎప్పుడు భారతదేశం వస్తున్నా ఓ టికెట్ కొనడం అలవాటు. అలా ఇప్పటికి 17 టికెట్లు కొన్నారు. ఆయన డిసెంబర్‌లో రిటైర్ కావాల్సి ఉంది. దాంతో మహా అయితే ఇంకొక్కసారి మాత్రమే ఆయన టికెట్ కొనగలిగేవారు. ఈలోపు అదృష్టం తన్నుకొచ్చి.. ఇటు ప్రాణాపాయం తప్పడంతో పాటు అటు భారీ మొత్తం కూడా కలిసొచ్చింది. దుబాయ్‌లో 37 ఏళ్లుగా ఉంటున్నానని, ఇక ఇది తనకు స్వదేశం లాగే అనిపిస్తోందని.. విమాన ప్రమాదం నుంచి తప్పుకొన్నందుకు దేవుడు తనకు రెండో జన్మ ఇచ్చినట్లు అనిపిస్తోందని ఖదర్ చెప్పారు. మంచి పనులు చేయడానికే తనకు ఇలా బతుకునిచ్చాడని అన్నారు.
అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేసే తరహా ఉద్యోగం ఏదైనా ఉంటే రిటైర్ అయిన తర్వాత భారతదేశంలో చూసుకుంటానని తెలిపారు. ఖదర్‌కు నెలకు రూ. 1.45 లక్షల జీతం వస్తుంది. కానీ, పుట్టిన 13వ రోజునే కింద పడిపోయి పక్షవాతం బారిన పడిన తన 21 ఏళ్ల కుమారుడి చికిత్స కోసం చాలా ఖర్చవుతోంది. అతడికి ఆపరేషన్ కోసం కొన్నాళ్ల క్రితం తాను రూ. 18 లక్షల అప్పు చేశానని, ఎలాగోలా దాన్ని తీర్చగలిగానని చెప్పారు. జీతం డబ్బులతోనే తన కూతురి పెళ్లి కూడా చేశారు.