
విభజనకు సీఎం ఓకే చెప్పారు: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్రప్రదేశ్ వీరుడిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన గురించి తాను సృష్టించుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ మాటలు మరోసారి స్పష్టంచేశాయి. ‘‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అంగీకరించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం వ్యవహరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు’’ అని దిగ్విజయ్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు. రాష్ట్ర శాసనసభకు తెలంగాణ బిల్లును పంపిస్తామని.. తీర్మానం ఉండదని ఆయన స్పష్టంచేశారు. ఈ నెలాఖరులోగా బిల్లును అసెంబ్లీకి పంపిస్తామన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి ముందు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. సమన్వయ కమిటీ ఏర్పాటయిన తర్వాత తొలి సమావేశమైనందున ఢిల్లీలో ఏర్పాటు చేశామని, రెండో సమావేశాన్ని హైదరాబాద్‌లో పెడతామని, తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
‘ఈ భేటీలో సీఎం మార్పు అంశాన్ని చర్చిస్తారా?’ అని ప్రశ్నించగా.. ‘‘అలాంటిదేమీ లేదు. సీఎం మార్పు ఎజెండాలో లేదు. సీఎల్పీ ఎన్నుకున్న నేత ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మార్పు ఉండదు’’ అని సమాధానం చెప్పారు. ‘విభజన నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకించారు కదా?’ అని ప్రస్తావించగా.. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని సీఎం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించే ప్రసక్తే లేదని దిగ్విజయ్ తేల్చిచెప్పారు. ‘‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పార్టీ అత్యుతన్న నిర్ణాయక వ్యవస్థ అయిన సీడబ్ల్యూసీలో తీసుకున్నాం. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. సీఎం కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. ఆయన, ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయులుగానే ఉన్నారు.
ఇప్పుడు కూడా విధేయతనే నిరూపించుకుంటారని విశ్వసిస్తున్నా. ఆయన కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఆ మూడు పార్టీలూ హాజరవ్వాలి: ‘రాయల తెలంగాణ’ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెస్తుండటం గురించి ప్రశ్నించగా.. ‘‘కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) పలు విషయాలపై చర్చిస్తోంది. వారికి వచ్చిన సలహాలు, సూచనలను క్షుణ్నంగా పరిశీలి స్తోంది’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ, సీపీఎం పార్టీలు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని సూచించారు. ‘‘సీమాంధ్ర ప్రజల క్షేమాన్ని కాంక్షించే పార్టీలు.. జీఓఎంకు సూచనలు, సలహాలు ఇవ్వాలి. జీఓఎం నిర్వహించనున్న సమావేశాన్ని బహిష్కరించకుండా.. హాజరుకావాలి. తమ వాదాలను జీఓఎంకు వినిపించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు, తీర్మానాలను రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు పంపించే అవకాశముందన్న ప్రశ్నకు.. ‘‘బిల్లు మాత్రమే పంపిస్తాం. తీర్మానం కాదు. ఈ నెల నాలుగో వారంలో బిల్లు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని దిగ్విజయ్ వివరించారు.