దిగ్విజయ్, సీఎం కిరణ్ ల మధ్య 'ఎమ్మెల్సీ' వార్
-
దిగ్విజయ్ సూచించిన పేరు పెట్టని సీఎం..
-
ఫోన్‌లోనే ఇరువురి ఘర్షణ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలికి గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ ఫైలు త్రిశంకు స్వర్గంలో ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్ల విషయం పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ల మధ్య ఘర్షణే దీనికి కారణమని తెలుస్తోంది. 4 నామినేటెడ్ ఎమ్మెల్సీల స్థానాల భర్తీకి ఉద్దేశించిన జాబితాలో సీఎం తన మిత్రుడైన పారిశ్రామికవేత్త రఘురామిరెడ్డి పేరు చేర్చి గవర్నర్‌కు ఫైలు పంపడం తెలిసిందే.
ఈ విషయాన్ని గవర్నర్ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో దిగ్విజయ్ కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడి, తాను సూచించిన పేరును జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇద్దరూ ఫోన్లోనే ఘర్షణ పడ్డారు. మీరు చెప్పిన పేరును మేడమ్(సోనియాగాంధీ)తో చెప్పించాలని సీఎం అన్నట్టు సమాచారం. సీఎంతో మాట్లాడాక దిగ్విజయ్.. రఘురామిరెడ్డి పేరు తొలగించి మిగతా ముగ్గురు పేర్లను ఆమోదించాలని గవర్నర్‌ను కోరారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
దీంతో రఘురామిరెడ్డి పేరు తీసేసి మిగిలిన నంది ఎల్లయ్య, కె.సత్యనారాయణరాజు, రత్నాబాయిలను తన కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ ఆమోదం తెలుపుతూ 12న ఫైలును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) భన్వర్‌లాల్‌కు పంపారు. సీఈఓ ఆరోజు రాత్రే గెజిట్ నోటిఫికేషన్ సిద్ధం చేశారు. దాన్ని జారీచేసేం దుకు సంబంధిత ఫైలును సీఎం, గవర్నర్‌ల ఆమోదానికి 13న ఉదయం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఆ ఫైలు సీఎస్ వద్దకెళ్లి 3 రోజు లవుతున్నా తిరిగి సీఈఓకు చేరలేదు. అది వస్తేగానీ సీఈఓ కార్యాలయం నోటిఫికేషన్ జారీచేయలేదు. ప్రస్తుతం ఫైలు సీఎం వద్దే ఉందని తెలిసింది.