
‘జీరో బ్యాలెన్స్..జీరో చార్జ్’..ఏ బ్యాంక్?
ఒకవైపు ఏప్రిల్ 1 నుంచి ప్రధాన బ్యాంకులు చార్జీల బాదుడుకు సిద్థమవుతోంటే కొటక్ మహీంద్రా బ్యాంకు (కెఎంబీ) ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ముంబై: ఒకవైపు ఏప్రిల్ 1నుంచి ప్రధాన బ్యాంకులు చార్జీల బాదుడుకు సిద్థమవుతోంటే కొటక్ మహీంద్రా బ్యాంకు (కెఎంబీ) ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాతో పాటు అన్ని డిజిటల్ లావాదేవీలను కూడా ఉచితంగా అందించనుంది. '811' ప్లాన్ తో ఈ సరికొత్త పథకాన్ని బుధవారం ప్రకటించింది. 811 ఖాతా తెరవడానికి, ఆపరేట్ చేయడానికి ఆధార్ , పాన్ నెంబర్ ఉంటే చాలని తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు బ్యాంక్ వెల్లడించింది.
మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు, రాబోయే 18 నెలల్లో 16 మిలియన్ల వినియోగదారులను సాధించే లక్ష్యంతో ఉన్నట్టు (కెఎంబీ) తెలిపింది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఐదు నిమిషాలలోనే మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా ఈ ఖాతాను తెరవవచ్చు. ఆధార్ ఆధారిత వన్ టైం పాస్‌వర్డ్ ప్రమాణీకరణ ద్వారా ఖాతా ఓపెన్ అవుతుంది. 811 పొదుపు ఖాతా పథకం ద్వాదా 100 పైగా ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక లావాదేవీలు నిర్వహణతోపాటు, ఆన్లైన్ షాపింగ్, విమానాలు, సినిమా టిక్కెట్లు, హోటల్ గదులు బుకింగ్ సేవలను పొందవచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలను కూడా అనుమతిస్తుంది.
కస్టమర్లకు వర్చ్యువల్ డెబిట్ కార్డు ఉచితం. అంటే యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేజ్. (యూపీఐ) ఆధార్ లేదా, నెట్ లో వర్చువల్ అడ్రస్‌తో బ్యాంక్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు నడపొచ్చు.
అంతేకాదు పొదుపు ఖాతా నిల్వపై సం.రానికి 6శాతందాకా వడ్డీని చెల్లించనున్నామని కోటక్ బ్యాంక్ ఈడీ, వైస్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ ప్రకటించారు.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఫీజును వసూలు చేయనున్న సంగతి తెలిసిందే.